ఆడతారనుకున్న ఆటగాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్లడంతో కోల్ కతా కష్టం(Trouble)గా బ్యాటింగ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్(KKR) స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సునీల్ నరైన్(27), అంగ్ క్రిష్ రఘువన్షీ(24) నిలబడతారనుకునే లోపే చాప చుట్టేశారు.
స్లో పిచ్ తో…
స్లో పిచ్ తో బాల్ బ్యాట్ పైకి రాకపోవడంతో కోల్ కతా టాప్, మిడిలార్డర్ ఇబ్బంది పడింది. బౌన్సీ బంతుల్ని ఎదుర్కోలేక, షాట్లు ఆడలేక పెద్దగా పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా 85 స్కోరుకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్(3), రమణ్ దీప్ సింగ్(13), రింకూ సింగ్(9), అండ్రీ రసెల్(10) ఒకరి వెంట ఒకరు దారి పట్టారు.
జడ్డూ, దేశ్ పాండే విజృంభణ…
4 ఓవర్ల స్పెల్ లో కేవలం 18 పరుగులే ఇచ్చిన జడేజా 3 కీలక వికెట్లు తీసుకోగా.. అటు తుషార్ దేశ్ పాండే సైతం ఇంకో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో అయ్యర్(34) కూడా ఔట్ కావడంతో ఆ జట్టు కథ ముగిసింది. జడ్డూ, తుషార్ ఇద్దరూ నిలకడగా బంతులేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 రన్స్ మాత్రమే చేయగలిగింది నైట్ రైడర్స్.