బెంగళూరు కథ మారలేదు…
ఆర్సీబీకి ఆరోసారీ అదృష్టం కలిసి రాలేదు…
వరుస ఓటములతో ఛాలెంజర్స్ కాస్తా అట్టడుగునే ఉంది.
ఎప్పుడో మార్చి 25న తన రెండో మ్యాచ్ లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)… ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్ లను ఓడిపోయింది. చివరకు ఆరో మ్యాచ్ అయినా కలిసి వస్తుందనుకుంటే అదీ జరగలేదు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ చివరి వరకు పోరాటం చేసినా బెంగళూరుకు కలిసి రాలేదు. టాప్, మిడిలార్డర్ లో ఎండింగ్ వరకు క్రీజులో నిలబడేవారే లేకపోవడంతో మరోసారి పరాజయాన్నే మూటగట్టుకుంది. 9 వికెట్లకు 221 స్కోరు వద్దే ఆగిపోయి ఒక్క పరుగుతో ఓటమి పాలైంది.
బ్యాటింగ్ ఇలా…
లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా మారిన మ్యాచ్ లో కోహ్లి(18), డుప్లెసిస్(7), విల్ జాక్స్(55; 32 బంతుల్లో 4×4, 5×6), రజత్ పటీదార్(52; 23 బంతుల్లో 3×4, 5×6) రాణించారు. చివర్లో కర్ణ్ శర్మ 6 బంతుల్లో 20 స్కోరు చేసినా, సిక్సర్లతో విరుచుపడ్డ ఫలితం దక్కలేదు. గ్రీన్(6) మరోసారి ఫెయిలయితే ప్రభు దేశాయ్(24), దినేశ్ కార్తీక్(25) అంతో ఇంతో రాణించారు. కీలక సమయంలో కర్ణ్ శర్మ ఔటవడంతో బెంగళూరు కథ క్లోజ్ అయింది.
రసెల్ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకుంటే.. హర్షిత్ రాణా, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. RCBకి ఇది వరుసగా ఆరో పరాజయం కాగా… ఇప్పటివరకు ఈ సీజన్లో 8 మ్యాచ్ లాడి ఏడింట్లో ఓటమి పాలైంది. అటు కోల్ కతా ఏడింటికి 5 మ్యాచ్ ల్లో గెలిచి రాజస్థాన్ తర్వాత రెండో ప్లేస్ లో ఉంది.