ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ప్రతాపం చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్.. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వీరవిహారం చేయడంతో 7 వికెట్లకు 272 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 33 రన్స్ కే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పరాజయం దిశగా సాగింది. చివరకు భారీ టార్గెట్ ను ఏ మాత్రం రీచ్(Reach) చేసే పరిస్థితి లేక నామమాత్రపు బ్యాటింగ్ కొనసాగించింది.
అరివీర భయంకరంగా…
సునీల్ నరైన్(85; 39 బంతుల్లో 7×4, 7×6), అంగ్ క్రిష్ రఘువన్షీ(54; 27 బంతుల్లో 5×4, 3×6), రసెల్(41; 19 బంతుల్లో 4×4, 3×6), రింకూ సింగ్(26; 8 బంతుల్లో 1×4, 3×6) హిట్టింగ్ కు దిగారు. వీరి ధాటికి ఢిల్లీ బౌలర్లు గల్లీ క్రికెటర్లలా మారిపోయారు. కొద్దిలో తప్పిపోయింది కానీ.. హైదరాబాద్ మొన్న నెలకొల్పిన 277 పరుగుల రికార్డు బద్ధలయ్యేదే.
ఢిల్లీ డీలా…
రికార్డు స్థాయి టార్గెట్ ఛేదించాల్సిన ఢిల్లీ పూర్తిగా డీలా పడిపోయింది. వరుసగా నలుగురు బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. వార్నర్(18), పృథ్వీషా(10), మార్ష్(0), అభిషేక్ పోరెల్(0) చేతులెత్తేయడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. కెప్టెన్ రిషభ్ పంత్(55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టన్ స్టబ్స్(54; 32 బంతుల్లో 4×4, 4×6) ఉన్నంతసేపు జోరు చూపించినా, అప్పటికే రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.
ఈ ఇద్దరి వెనుదిరిగిన తర్వాత 159 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైపోయింది. ఢిల్లీ నాలుగు మ్యాచ్ లాడితే మూడింట్లో ఓటమే ఎదురైంది. కోల్ కతా మాత్రం మూడింటికి మూడు మ్యాచ్ లు గెలుపొందింది.