2023 వరల్డ్ కప్(World Cup) రేసులో ఉండే మణికట్టు స్పిన్నర్(Wrist Spinner) ఎవరు.. యుజువేంద్ర చాహలా, కుల్దీప్ యాదవా.. 2022లో అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఇది. చాహల్ ఒకరకంగా దూసుకుపోతుంటే.. కుల్దీప్ మాత్రం గాయంతో బాధపడుతూ సర్జరీతో 5 నెలలు ఆటకు దూరమై.. తుదకు IPLలో బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఏమనుకుంటారు.. కచ్చితంగా చాహలే ముందుంటాడని భావించారు. కుల్దీప్ కన్నా చాహల్ గణాంకాలు అలా ఉన్నాయి మరి. 2019 వరల్డ్ కప్ తర్వాత నుంచి 2022 వరకు 21 వన్డేలాడిన చాహల్ 28.41 యావరేజ్ తో 34 వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో కుల్దీప్ మాత్రం 43.73 సగటుతో 26 వికెట్లే తీసుకున్నాడు. ఈ లెక్కలు చాలు కుల్దీప్ కన్నా చాహల్ ముందున్నాడని చెప్పడానికి. ఈ పరిస్థితుల్లో IPL ఫ్రాంచైజ్ కోల్ కతా నైట్ రైడర్స్ కి ఆడుతున్న కుల్దీప్ చివరకు బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది.
దూసుకుపోయిన ఎడమచేతి వాటం స్పిన్నర్
కానీ అంతలోనే పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కుల్దీప్ కన్నా రేసులో ముందుకు సాగిన చాహల్ క్రమంగా తన గ్రాఫ్ ను కోల్పోయాడు. కుల్దీప్ తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా చాహల్ ను మరిపించేశాడు. చాహల్ 2022 నుంచి ఇప్పటివరకు 16 వన్డేల్లో 27.91 సగటుతో 24 వికెట్లు తీసుకోగా.. ఎకానమీ రేట్ కూడా 5.53 నుంచి 5.70కి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ మేనియా స్టార్ట్ అయింది. బౌలింగ్ లో వైవిధ్యాన్ని కనబరుస్తూ, బాల్ ను గింగిరాలు తిప్పుతూ కుల్దీప్ మాయ చేస్తున్నాడు. చాహల్ కన్నా రెండింతలు ఎక్కువగా వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2022 నుంచి ఇప్పటివరకు 24 మ్యాచ్ ల్లో 18.93 యావరేజ్ తో 43 వికెట్లు తీసుకున్నాడు. 2019 వరల్డ్ కప్ అనంతరం 2022 వరకు 5.76 ఎకానమీ రేట్ కలిగిన కుల్దీప్.. ప్రస్తుతం 4.70కు చేరుకోవడంతోనే వరల్డ్ కప్ టీమ్ లో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో మ్యాచ్ ల్లో 3 వికెట్ల మార్క్ ను అందుకున్న ఈ రిస్ట్ స్పిన్నర్.. దక్షిణాఫ్రికా, శ్రీలంకలతో మాచ్ ల్లో 4 వికెట్ల హాల్ తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఆసియా కప్ ప్రదర్శన అహో…
ఆసియా కప్ సూపర్-4 పోరులో దాయాది దేశం పాకిస్థాన్ పై 25 రన్స్ కే 5 వికెట్లు తీసుకుని తానేంటో చాటిచెప్పాడు. అంతకుముందు చాలా స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ అన్ని వర్గాల నుంచి కుల్దీప్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2021లో 5 నెలలు రెస్ట్ తీసుకున్న సమయంలోనే రియలైజ్ అయిన ఈ స్పిన్నర్.. రన్ అప్ ను మార్చుకుని 45 డిగ్రీల యాంగిల్ లో బాల్ వేయడం స్టార్ట్ చేశాడు. పాక్ పై 5 వికెట్లు తీసిన తర్వాత మాట్లాడిన కుల్దీప్.. సర్జరీ తర్వా రన్ అప్ స్ట్రెయిట్ గా మారిందని, రిథమ్ లో దూకుడు వచ్చిందని ఈ మార్పుల వల్లే బ్యాటర్లను కట్టడి చేస్తున్నానని అన్నాడు. పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ వికెట్ తీసిన విధానమే కుల్దీప్ బౌలింగ్ శైలి మారిందనడానికి ఎగ్జాంపుల్ గా నిలిచింది. ప్రస్తుతం కుల్దీప్ ఫామ్ చూస్తుంటే అతడి బౌలింగ్ లో ఆడటం అంత సులువు కాదని అర్థమవుతున్నది. అందుకే ప్రత్యర్థి బ్యాటర్లు ఆచితూచిగా ఇతణ్ని ఎదుర్కొంటున్నారు. మరో 10 రోజుల్లో మొదలు కానున్న వరల్డ్ కప్ లో ఈ స్పిన్నర్.. భారత జట్టుకు కీలకం కానున్నాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.