సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్.. విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను లబుషేన్ సెంచరీ((111; 173 బంతుల్లో 10×4, 2×6)తో ఆదుకున్నాడు. 113/4తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టు.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు పోరాటం సాగిస్తోంది. ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే కంగారూ జట్టు మరో 61 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంకో 5 వికెట్లు తీస్తే విజయం ఇంగ్లాండ్ దాసోహమవుతుంది. ఐదో రోజు మార్ష్, గ్రీన్, క్యారీ రాణిస్తేనే ఆస్ట్రేలియా ఓటమి నుంచి బయటపడే అవకాశముంది.
108 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయినా సహనంతో బ్యాటింగ్ కొనసాగించిన లబుషేన్.. ఐదో వికెట్ కు మార్ష్ తో కలిసి 103 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేశాడు. సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే ఔటయ్యాడు. రూట్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. మిచెల్ మార్ష్(31), కామెరూన్ గ్రీన్(3) క్రీజులో ఉన్నారు. మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. వోక్స్, రూట్ వికెట్ చొప్పున ఖాతాలో వేసుకున్నారు.