
శ్రీలంక వరుస పరాజయాలు ఆ దేశ రాజకీయాలపై ప్రభావం చూపాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC)కి, ప్రభుత్వానికి మధ్య వివాదం చోటుచేసుకోగా.. ఇప్పుడు ICC(International Cricket Council) సైతం పనిష్మెంట్ ఇచ్చే రీతిలో కీలక నిర్ణయం తీసుకుంది. ICCలో ఆ జట్టు మెంబర్ షిప్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం మితిమీరిందని, ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బోర్డు అచేతనంగా మారిందంటూ ICC కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై విధించిన తాత్కాలిక నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు అనుసరించాల్సిన నియమాలు, విధివిధానాల(Guidelines)పై త్వరలో జరిగే ICC బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని తెలియజేసింది.
రద్దుకు పార్లమెంటు ఆమోదం
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఘోర ఓటమితో శ్రీలంక క్రికెట్ బోర్డును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. మన టీమ్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్ కావడంతో శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే.. బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. షమ్మి సిల్వా సారథ్యంలోని క్రికెట్ బోర్డును రద్దు చేయడంతో ఆ కార్యవర్గం అప్పీల్ కోర్టును ఆశ్రయించింది. కార్యవర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి బోర్డును పునరుద్ధరించాలని అప్పీలు కోర్టు ఆదేశించింది. దీంతో బోర్డు రద్దు తీర్మానానికి శ్రీలంక పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. ఇలా రాజకీయాలకు కేంద్రంగా మారిన లంకను సభ్యత్వం నుంచి తొలగించాలని ICC నిర్ణయం తీసుకుంది.