ఎన్నో అనుమానాలు.. మరెన్నో అపోహలు.. అతణ్ని తీసుకున్నారేంటి.. IPLలో దుమ్మురేపిన కుర్రాళ్లను పక్కనపెట్టి. చాలా కాలం ఆటకే దూరమైన ప్లేయర్ ను పాకిస్థాన్ తో ఆడిస్తారా… ఇవీ ఆసియా కప్ లో భాగంగా దాయాది దేశంతో జరిగిన సూపర్-4 మ్యాచ్ కు ముందు వినిపించిన మాటలు. కానీ ఇప్పుడా ఆటగాడే జట్టుకు కీలకంగా మారాడు. అరివీర భయంకరులని పేరున్న పాక్ ఫాస్ట్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఎంతెంత స్పీడ్ గా బాల్స్ వేశారో అంతే స్పీడ్ తో వాటిని బౌండరీ లైన్ దాటించాడు. గ్రౌండ్ కు అన్ని వైపులా షాట్లు బాదుతూ తన రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. తొడ గాయం వల్ల ఆటకే దూరమైన KL.. రీ ఎంట్రీని అదీ దాయాది దేశంపై సూపర్ గా స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్ నింపుకున్నాడు. నిజానికి ఈ ప్లేయర్ గేమింగ్ పై గత కొన్నాళ్ల వరకు ఎవరికీ సందేహాల్లేవు. అంతలా బ్యాట్ కు పనిచెప్పే లోకేశ్.. కొంతకాలం క్రితం వరకు పెద్దగా రాణించలేదు. అడపాదడపా మాత్రమే మెరుగైన స్కోరు చేసేవాడు. జట్టుకు కీలక ప్లేయర్ గా నిలవాల్సిన తరుణంలో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇప్పటివరకు 47 టెస్టులు, 54 వన్డేలు, 70 టీ20లు ఆడితే.. వన్డేల్లోనే యావరేజ్(45.13) ఎక్కువగా ఉంది.
కానీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ కీలక సమయంలో గట్టిగా నిలబడ్డాడు. రాహుల్ ధాటిగా ఆడటం స్టార్ట్ చేసిన తర్వాతే కోహ్లి గేర్ మార్చాడు. ఎక్కడా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా ఇన్నింగ్స్ మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో గనుక ఆడకపోతే పని అయిపోయినట్లే అని భావించిన తరుణంలో ఒక్కసారిగా KL విరుచుకుపడ్డాడు. తనపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చే వరల్డ్ కప్ లో ఎలాంటి డేంజరస్ ప్లేయరో చెప్పకనే చెప్పాడు. ఒక ఆటగాడిగా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్.. ఇతర ఏ జట్టయినా ఒక రకంగా ఉంటుంది.. కానీ పాకిస్థాన్ కావడం వల్ల అటు రన్స్ చేయాల్సి రావడం.. మరోవైపు తీవ్రమైన ప్రెజర్ ఉండటం సహజం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేసి పునరాగమనాన్ని(Re Entry) ఈ సీనియర్ బ్యాటర్ ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్ లోనూ ఇషాన్ కిషన్ కొద్ది సేపు మాత్రమే వికెట్ కీపింగ్ చేయగా.. ఆ బాధ్యతల్ని KLకు అప్పగించాడంటేనే కెప్టెన్ రోహిత్ కు ఎంత నమ్మకముందో మరోసారి రుజువైంది. మరో నెల రోజుల్లోపే వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ కానున్న టైమ్ లో రాహుల్ ఫామ్ లోకి రావడం భారత జట్టుకు పెద్ద సానుకూలాంశమే.
గత మూడేళ్ల కాలంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టూర్లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడీ టాప్ క్లాస్ ప్లేయర్. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు రోహిత్ ఆబ్జెన్సీలో కెప్టెన్ గా వ్యవహరించి హాఫ్ సెంచరీ చేసినా ఆ మ్యాచ్ లో మన జట్టు ఓటమి పాలైంది. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో సెంచరీ చేసిన అతడు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ మార్క్ ను అందుకున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో రాహుల్ ను BCCI.. టెస్ట్ వైస్ కెప్టెన్సీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తప్పించింది. చాలా మంది మాజీలు ఇతడి ఆటతీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. గాయాలు, సర్జరీలతో చాలా కాలం ఆటకే దూరమై కెరీర్ ను ప్రమాదంలో నెట్టుకున్న లోకేశ్ రాహుల్.. తనపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టకేలకు ఈ మ్యాచ్ తో నిలబెట్టుకున్నాడు. అందరూ కలలు గనే ఇన్నింగ్స్ ఆడి తన సామర్థ్యాన్ని మరోసారి బయటకు చూపించాడు.