
Published 19 Dec 2023
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు ఇద్దరి హాఫ్ సెంచరీలతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(62; 83 బంతుల్లో 7×4, 1×6), కెప్టెన్ కేఎల్ రాహుల్(56; 64 బంతుల్లో 7×4) రాణించినా మిగత్యా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 46.2 ఓవర్లలో టీమిండియా 211 పరుగులకు ఆలౌటయింది. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ సాయి సుదర్శన్ వరుసగా రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. రుతురాజ్ గైక్వాడ్(4) మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరితే మిగతా బ్యాటర్లు తిలక్ వర్మ(10), సంజూ శాంసన్(12), రింకూ సింగ్(17), అక్షర్ పటేల్(7) సైతం క్రీజులో నిలవకుండానే వెనుదిరిగారు. 46 స్కోరుకే 2 వికెట్లు పడ్డా సుదర్శన్ తో కలిసి రాహుల్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు.
నండ్రే బర్గర్ 3, హెన్రిక్స్ 2, కేశవ్ 2 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. విలియమ్స్, మార్ క్రమ్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. 186 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన టీమ్ 200 స్కోరు దాటుతుందా అన్న సందేహం కనిపించింది. కానీ అర్షదీప్ సింగ్ ఒక ఫోర్, సిక్స్ తో 18 రన్స్ చేయడంతో భారత్ 211 పరుగుల స్కోరుతో గౌరవప్రదంగా ముగించింది.