తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ హిట్టింగ్.. ఆ తర్వాత మయాంక్ యాదవ్ బౌలింగ్ జోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్(LSG) విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లఖ్ నవూ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదించడంలో RCB చేతులెత్తేసి 19.3 ఓవర్లలో 153 రన్స్ కు ఆలౌటై 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
డికాక్ ఒక్కడే…
డికాక్(81; 56 బంతుల్లో 8×4, 5×6) బాదుడుతో లఖ్ నవూ తేరుకుంది. ముగ్గురు కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే వికెట్లు ఇచ్చేసినా డికాక్ హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడాడు. కేఎల్ రాహుల్(20), దేవ్ దత్ పడిక్కల్(6), మార్కస్ స్టాయినిస్(24), బదోని(0) రాణించకున్నా.. చివర్లో పూరన్(40; 21 బంతుల్లో 1×4, 5×6) దంచికొట్టాడు. వరుసగా మూడు బంతులకు మూడు సిక్సర్లు కొట్టడంతో లఖ్ నవూ స్కోరు వేగం పెరిగింది.
టాప్ ఆర్డర్ టపటపా…
182 టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు తొందరగానే కష్టాలు మొదలయ్యాయి. స్పీడ్ గన్(Speed Gun) మయాంక్ యాదవ్ మూడు వికెట్లతో మాయ చేశాడు. కోహ్లి(22), డుప్లెసిస్(19), మాక్స్ వెల్(0), గ్రీన్(9) పెద్దగా స్కోర్లు చేయకుండానే దొరికిపోయారు. మాక్స్ వెల్, గ్రీన్, పటీదార్(29; 21 బంతుల్లో 2×4, 2×6)ను మయాంకే ఔట్ చేశాడు. తర్వాత కొద్దిసేపటికే అనూజ్ రావత్(11) క్యాచ్ అవుటయ్యాడు. మహిపాల్ లామ్రోర్(33; 13 బంతుల్లో 3×4, 3×6) ఉన్నంతసేపు ఊపేసినా మ్యాచ్ ను చివరి వరకు నిలబడలేదు.