
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కు చివరకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ ఏర్పడి అభిమానుల హంగామాకు హద్దు లేకుండా పోతున్న తరుణంలో వరుణుడు తరచూ ఆటను డిస్టర్బ్ చేశాడు. అప్పటికే మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. తొలుత పాక్ బౌలర్లు, తర్వాత టీమ్ఇండియా బ్యాటర్లు, మళ్లీ పాక్ పేస్ త్రయం ఇలా సాగింది భారత్-పాక్ మ్యాచ్. అయినా కంటిన్యూ చేసినా చివరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రద్దు చేయక తప్పలేదు. ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె గ్రౌండ్ లో జరిగిన వన్డేలో.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్ల ధాటికి భారత టాప్ ఆర్డర్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(11), శుభ్ మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4), శ్రేయస్ అయ్యర్(14) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 66 రన్స్ కే 4 వికెట్లు చేజార్చుకున్న జట్టును ఇషాన్ కిషన్(82, 81 బంతుల్లో; 9×4, 2×6), హార్దిక్ పాండ్య(87, 90 బంతుల్లో; 7×4, 1×6) ఆదుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆది నుంచి పాక్ బౌలర్ల భరతం పట్టాడు. 4.2 ఓవర్లలో టీమ్ఇండియా స్కోరు 15/0 వద్ద ఉన్న దశలో వర్షం వచ్చింది. కానీ కాసేపటికే తగ్గడంతో మ్యాచ్ కంటిన్యూ అయింది. మరోసారి 11.2 ఓవర్ వద్ద 51/3తో ఉన్న దశలో వర్షం పడింది. కానీ ఆ తర్వాత ఇబ్బందేమీ లేకపోవడంతో మ్యాచ్ కొనసాగించారు.

ఇషాన్ కిషన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలుత నిదానంగా ఆడిన పాండ్య సైతం క్రమంగా జోరు పెంచాడు. ఈ ఇద్దరి ధనాధన్ ఆటతీరుతో పాక్ బౌలర్లు డిఫెన్స్ లో పడిపోయారు. 204 స్కోరు వద్ద ఇషాన్ ఔటయితే ఆ వెంటనే 239 స్కోరు వద్ద హార్దిక్ వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా(14), శార్దూల్(3), కుల్దీప్(4) నిలవలేకపోయారు. చివర్లో బుమ్రా(16) ఉన్నంత సేపు జోరు చూపించాడు. బుమ్రా ఔటవడంతో భారత్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయింది. ఇక బ్యాటింగ్ కు పాక్ దిగాల్సిన టైమ్ లో మళ్లీ వర్షం అందుకోవడంతో ప్లేయర్లు గ్రౌండ్ లోకి అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇలా అర్థంతరంగా మ్యాచ్ ఆగిపోవడంతో అభిమానుల్లో నిరాశ ఏర్పడింది. తర్వాతి మ్యాచ్ లో భారత్ ఈ నెల 4న నేపాల్ తో తలపడుతుంది.