తొలుత తడబడ్డా చివరకు ముంబయి ఇండియన్స్(MI) నిలబడింది. రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్దిక్ సేన.. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ఆరంభంలోనే అవస్థలు(Problems) పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), ఇషాన్ కిషన్(0) నిరాశపరిస్తే.. సూర్యకుమార్(8) ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాజస్థాన్ పేస్ బౌలర్ సందీప్ శర్మ.. కీలకమైన ఐదు వికెట్లు తీసుకుని ముంబయి భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. దీంతో MI కాస్తా 9 వికెట్లకు 179 వద్దే ఆగిపోయింది.
ఆ జోడీతో…
20 స్కోరుకే 3 కీలక వికెట్లు చేజార్చుకున్న ముంబయి మొదట ఆచితూచి ఆడింది. మహ్మద్ నబీ(23)తో కలిసి ఇన్నింగ్స్(Innings)ను తిలక్ వర్మ ముందుకు నడిపించాడు. ఈ జోడీ నాలుగో వికెట్ కు కేవలం 32 రన్స్ అందించిన తర్వాత నబీ అవుటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన నేహల్ వధేరా(49; 24 బంతుల్లో 3×4, 4×6) మళ్లీ ముంబయికి ఊపు తెచ్చాడు. కానీ ఫిఫ్టీ చేరుకోకుండానే వికెట్ పారేసుకున్నాడు.
తిలక్ వర్మతో…
ఈ మ్యాచ్ లో సందీప్ శర్మ తన బౌలింగ్ తో ప్రత్యర్థిని శాసించాడు. అతడి ధాటికి ఒకవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ(65; 45 బంతుల్లో 5×4, 3×6) జోరు ఆగలేదు. హార్దిక్(10) సైతం చేతులెత్తేసినా ఈ లెఫ్ట్ హ్యాండర్ నిలకడగా ఆడాడు. 4 ఓవర్లు వేసిన సందీప్ 13 డాట్స్ బాల్స్ వేయడమే కాకుండా కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బౌల్డ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.