తొలుత బౌలింగ్ లో బుమ్రా మ్యాజిక్.. తర్వాత బ్యాటింగ్ లో టాప్ ప్లేయర్ల హిట్టింగ్.. వెరసి ముంబయి ఇండియన్స్ జోరు ‘మస్త్ మస్త్’గా సాగింది. ప్రత్యర్థి అయిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మొదట 8 వికెట్లకు 196 స్కోరు చేస్తే… హార్దిక్ సేన ఆ టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ సూపర్ పునరాగమనం(Re-Entry)తో బెంగళూరు బేజారైపోయింది. 15.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 199 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో ముంబయి ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్ ఇలా…
ఇషాన్ కిషన్(69; 34 బంతుల్లో 7×4, 5×6) విధ్వంసం మొదలుపెడితే.. సూర్యకుమార్ యాదవ్ మరింత బీభత్సంగా దాన్ని కంటిన్యూ చేశాడు. ఇషాన్ 23 బంతుల్లో 50 చేస్తే, సూర్య కేవలం 17 బంతుల్లోనే ఆ మార్క్ ను దాటాడు. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ(38; 24 బంతుల్లో 3×4, 3×6) ఇషాన్ తో తొలి వికెట్ కు 101 పరుగులు జత చేశాడు. సూర్య(52; 19 బంతుల్లో 5×4, 4×6) ఔటైనా లాంఛనాన్ని హార్దిక్ పాండ్య పూర్తి చేశాడు. ఇషాన్, రోహిత్, సూర్య దూకుడుతో ముంబయి ఇన్నింగ్స్ 12 రన్ రేట్ పైగానే కొనసాగింది.
బెంగళూరు ఢీలా…
బుమ్రా దూకుడుతో బ్యాటింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ మరిన్ని పరుగులు కోల్పోయింది. అయితే బౌలింగ్ లోనూ ఆ టీమ్ ముంబయి బ్యాటర్ల దాడికి గురైంది. డుప్లెసిస్(61; 40 బంతుల్లో 4×4, 3×6), రజత్ పటీదార్(50; 26 బంతుల్లో 3×4, 4×6), దినేశ్ కార్తీక్(53; 23 బంతుల్లో 5×4, 4×6) ధనాధన్ బ్యాటింగ్ కొనసాగించారు. చివర్లో కార్తీక్ దంచికొట్టడంతో బెంగళూరు 196 స్కోరు చేసింది.
వరుసగా నాలుగోది…
కార్తీక్ 22 బంతుల్లో, పటీదార్ 25 బాల్స్ లో, డుప్లెసిస్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చిన బుమ్రా.. కీలక ఐదు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. RCB బౌలర్లంతా ధారాళంగా పరుగులిచ్చారు. ఇది బెంగళూరుకు వరుసగా నాలుగో ఓటమి. ఐదు మ్యాచ్ లాడి తొలి మూడింటిని కంటిన్యూగా కోల్పోయిన ముంబయి.. ఇప్పుడు వరుసగా రెండో మ్యాచ్ ను గెలుచుకుంది.