అది బౌలింగేనా లేక మాయనా… ప్రతి బంతి(Every Ball)కీ బ్యాటర్ దగ్గర సమాధానముంటుంది. డిఫెన్స్ ఆడటమో, షాట్ కొట్టడమో, దాన్ని వదిలిపెట్టడమో అన్న అవకాశాలు బ్యాటర్ల దగ్గర ఉంటాయి. కానీ డిఫెన్స్ ఆడే ఛాన్సే లేక.. షాట్ కొట్టలేని నిస్సహాయతలో.. ఎలా వదిలిపెట్టాలన్న ఆలోచన(Thought) చేయాలన్న టైమ్ కూడా ఇవ్వకుండా బంతి లోపలికి చొచ్చుకు వస్తే అంతకన్నా డేంజరస్ సిట్యుయేషన్ మరోటి ఉండదేమో. సరిగ్గా అచ్చం అలాంటి బాల్స్ తోనే ఇంగ్లండ్ బౌలర్లకు.. అదీ స్పిన్ కు అనుకూలించే(Support) భారత పిచ్ పైనే చుక్కలు చూపించాడంటే ఆ డెలివరీలు ఎలాంటివో చెప్పాల్సిన పని లేదు. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదనే చెప్పాలి. చూస్తూ ఉంటే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆ యార్కర్, ఔట్ స్వింగర్.. బుమ్రాను భారత్ కే కాదు ప్రపంచంలోనే మేటి బౌలర్ గా ఎందుకు నిలబెట్టాయో చెబుతాయి.
భారత ‘గైడెడ్ మిసైల్’…
విశాఖలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్ 28వ ఓవర్లో.. ఓ అద్భుతమే చోటుచేసుకుంది. ఒలీ పోప్ బ్యాటింగ్ చేస్తున్న వేళ బుమ్రా ఇన్ స్వింగింగ్ యార్కర్(Yorker)ను సంధించాడు. అసలు ఆ బాల్ కు పోప్ వద్ద ఆన్సరే లేకుండా పోయింది. బాల్ లోపలికి చొచ్చుకు వచ్చి వికెట్లను తాకి మిడిల్, లెగ్ స్టంప్ లు పైకి లేచి, బెయిల్స్ గాల్లో తేలియాడిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. బుమ్రా విసిరింది ‘గైడెడ్ మిసైల్’ అంటూ ఆ పేసర్ ను ఆకాశానికెత్తేశారు. ‘పాపం.. రెండు అమాయక(Innocent) వికెట్లను బుమ్రా చంపేశాడు’ అని ఒకరు… ‘ప్రతి ఫాస్ట్ బౌలర్ కలలుగనే డ్రీమ్ డెలివరీ’ అని మరొకరు… ‘బుమ్రాకు ఈ యార్కర్ కోసమే స్పెషల్ అవార్డు క్రియేట్ చేయాలేమో’ అంటూ ఇంకొకరు… ’28వ ఓవర్లో 88 కిలోమీటర్ల స్పీడ్ తో 2.4 డిగ్రీల స్వింగ్ మిశ్రమంతో కూడిన యార్కర్ కు పోప్ నుంచి నో రెస్పాన్స్’ అంటూ… ఇలా సామాజిక మాధ్యమాల(Social Media)ను హోరెత్తిస్తున్నారు.
పోప్ లాగే కెప్టెన్ కూడా…
కేవలం ఒలీ పోపే కాకుండా కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అదే రీతిలో బాధితుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49.2 ఓవర్ వద్ద మరో అద్భుతం జరిగింది. అప్పటికే జోరు మీదున్న స్టోక్స్(47)ను ఊహించని రీతిలో బుమ్రా బోల్తా కొట్టించాడు. ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బాల్ స్వింగ్ అయి వికెట్లను హిట్ చేయడంతో.. స్టోక్స్ బ్యాట్ వదిలేసి ఏం చేసినా తప్పించుకోలేకపోయా అన్న రీతిలో రెండు చేతుల్ని పైకెత్తి నిస్సహాయంగా చూశాడు. నిజంగా ఆ టైమ్ లో స్టోక్స్ హావాభావాలు(Expressions) చూస్తేనే బుమ్రా గొప్పతనం అర్థమవుతుంది. అలా తన బౌలింగ్ మాయతో నిజంగానే ఇంగ్లిష్ ఆటగాళ్లను గడగడలాడించిన జస్ ప్రీత్ ను ఆకాశానికెత్తడంలో ఆశ్చర్యం లేదు.
Published 03 Feb 2024