ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్, మంగోలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో రికార్డులు బద్ధలయ్యాయి. చైనాలో జరుగుతున్న క్రీడల్లో నేపాల్ టీమ్ అరుదైన ఘనత సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో ఏకంగా 314 రన్స్ చేసింది. ఆ జట్టు బ్యాటర్ కుశాల్ మల్లా అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. కేవలం 34 బాల్స్ లోనే సెంచరీ బాది టీ20ల్లో అత్యంత ఫాస్టెస్ట్ శతకం సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 35 బాల్స్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ ల రికార్డును కుశాల్ మల్లా తుడిపేశాడు. కుశాల్ 50 బంతుల్లోనే 8 ఫోర్లు, 12 సిక్సర్లతో మొత్తం 137 రన్స్ చేశాడు. మొత్తంగా నేపాల్ జట్టులో 26 సిక్సర్లు నమోదయ్యాయి. కుశాల్ మల్లా(137; 50 బంతుల్లో, 8×4, 12×6), రోహిత్ పౌడెల్(61; 27 బంతుల్లో, 2×4, 6×6), దీపేంద్ర సింగ్ (52; 10 బంతుల్లో, 8×6) రికార్డుల మోత మోగించారు.
యువరాజ్ రికార్డు అధిగమించి
ఇదే మ్యాచ్ లో మరో నేపాల్ ఆటగాడు ఇంకో భారత ప్లేయర్ రికార్డును అధిగమించాడు. కుశాల్ మల్లా.. రోహిత్ రికార్డును చెరిపేస్తే దీపేంద్రసింగ్ ఆరి 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 12 బాల్స్ తో హాఫ్ సెంచరీ చేసిన యువరాజ్ రికార్డును దీపేంద్రసింగ్ అధిగమించాడు. మరోవైపు నేపాల్ సాధించిన స్కోరు టీ20 క్రికెట్ లోనే అత్యధికం(Highest) కావడం విశేషం. 315 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మంగోలియా.. 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. దీంతో నేపాల్ 273 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.