అందరూ ఊహించినట్లు(Expectations)గా అద్భుతం(Miracle) ఏం జరగలేదు. న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ లో ఒక జట్టుదే డామినేషన్. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ ఛేజింగ్ కే మొగ్గుచూపింది. తమ దేశ క్రికెట్ బోర్డు సంజాయిషీ అడిగినా ఆటతీరులో ఎలాంటి మార్పు లేని లంక.. 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. సగం ఓవర్లు పూర్తి కాకుండానే కివీస్ ఆటగాళ్లు లక్ష్య ఛేదనను కంప్లీట్ చేశారు. 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.
లంక విలవిల
ఓపెనర్ కుశాల్ పెరీరా(51; 28 బంతుల్లో 9×4, 2×6) మినహా అంతా తొందరగానే ఔటయ్యారు. నిశాంక(2), కెప్టెన్ మెండిస్(6), సమరవిక్రమ(1), అసలంక(8), మాథ్యూస్(16), ధనంజయ(19) ఇలా టాప్ ఆర్డర్ అంతా కకావికలమైంది. కుశాల్ పెరీరా కేవలం 22 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓపెనర్ చేసిన పరుగు(51)ల్లో 48 రన్స్ బౌండరీలు, సిక్స్ ల ద్వారా వచ్చినవే. ఒకవైపు పెరీరా ధాటిగా ఆడుతున్నా అవతలి ఎండ్ లో ఎవరూ నిలవలేదు. 128 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన లంక.. మహీశ్(38), మధుశంక(19) చివరి వికెట్ కు 43 రన్స్ జోడించడంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.
రన్ రేట్ కోసం కివీస్ ధనాధన్
ఈ మ్యాచ్ లో గెలిచినా సెమీస్ ఆశలు అంత ఈజీగా లేకపోవడంతో న్యూజిలాండ్.. అత్యంత ఫాస్ట్ గా టార్గెట్ రీచ్ కావాలన్న లక్ష్యంతో కనిపించింది. ఓపెనర్లు కాన్వే(45), రచిన్(42) మంచి పార్ట్నర్ షిప్(86 రన్స్) అందించారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 బంతుల్లోనే 42 రన్స్ చేశాడు. కెప్టెన్ విలియమ్సన్(14), చాప్ మన్(7) మిచెల్(43) ఔటైనా ఫిలిప్స్, లాథమ్ జోడీ మరో వికెట్ పడకుండా టార్గెట్ రీచ్ చేసింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ మరింత పెరిగింది. దీంతో శనివారం ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ తేడాతో విజయం సాధిస్తే తప్ప కివీస్ సెమీస్ ను అడ్డుకోనట్లే.