
Published 21 Jan 2024
ఇప్పటికే వరుసగా నాలుగు టీ20(T20)లను కోల్పోయిన పాకిస్థాన్(Pakistan).. న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకుంది. కివీస్(New Zealand) చేతిలో 4-0 తేడాతో ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న పాక్.. చివరి టీ20లో మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న అఫ్రిది సేన.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 92 రన్స్ కు ఆలౌటై 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇద్దరు మాత్రమే…
మహ్మద్ రిజ్వాన్(38) ఆ టీమ్ లో టాప్ స్కోరర్ కాగా, ఫకర్ జమాన్(33), షాహిబ్ జాదా ఫర్హాన్(19) మాత్రమే ఈ స్థాయిలోనైనా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఏ ఒక్క బ్యాటరూ ఎక్కువ సేపు నిలవలేదు. సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్, ఇష్ సోధి తలో రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లో న్యూజిలాండ్ టీమ్ పాకిస్థాన్ కు చుక్కలు చూపించింది.
కుప్పకూలిన కివీస్…
తక్కువ టార్గెట్ తోనే బరిలోకి దిగిన కివీస్ కు.. బ్యాటర్ల ఫెయిల్యూర్ ఇబ్బందికరంగా మారింది. ఆ జట్టులో గ్లెన్ ఫిలిప్స్(26)దే అత్యధిక స్కోరు(Highest Score). ఫిన్ అలెన్(22), వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్(19) విల్ యంగ్(12) స్కోర్లు చూస్తేనే వారి ఆటతీరు అర్థమవుతుంది. న్యూజిలాండ్ టీమ్ లో నలుగురు బ్యాటర్లు వ్యక్తిగత స్కోరు 1 వద్ద ఔటయ్యారు. ఇఫ్తికార్ అహ్మద్ 3… షహీన్ షా అఫ్రిది, మహ్మద్ నవాజ్ రెండేసి చొప్పున… జమాన్ ఖాన్, ఉసామా మిర్ ఒకటి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ 4-1 తేడాతో సిరీస్ ను ప్రత్యర్థికి అప్పగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను ఇఫ్తికార్ అహ్మద్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ను ఫిన్ అలెన్ అందుకున్నారు.