వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కు చుక్కలు చూపించారు న్యూజిలాండ్ ఆటగాళ్లు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అజేయ సెంచరీలతో కివీస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. విలియమ్సన్, సౌథీ, ఫెర్గూసన్, బ్రేస్ వెల్ లాంటి స్టార్లు లేకున్నా ఆ లోటు ఎక్కడా కనపడనివ్వకుండా తానెంత డేంజరస్ జట్టో న్యూజిలాండ్ నిరూపించింది0. గత వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ఈ ప్రపంచకప్ ఫస్ట్ మ్యాచ్ లోనే ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 రన్స్ చేసింది. 36.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 రన్స్ చేసిన కివీస్ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జో రూట్(77; 86 బంతుల్లో, 4×4, 1×6) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కెప్టెన్ జోస్ బట్లర్(43) రాణించాడు. మిగతా ఇంగ్లిష్ బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. బెయిర్ స్టో(33), డేవిడ్ మలన్(14), హ్యారీ బ్రూక్(25), మొయిన్ అలీ(11), లివింగ్ స్టన్(20), సామ్ కరణ్(14) ఒకరి వెంట మరొకరు పెవిలియన్ కు చేరుకున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 3, శాంట్నర్ 2, ఫిలిప్స్ 2, బౌల్ట్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
దడదడలాడించిన కాన్వే, రచిన్
283 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ కు 10 రన్స్ కు చేరుకోగానే ఓపెనర్ విల్ యంగ్(10) ఔటయ్యాడు. స్టార్టింగ్ లోనే వికెట్ తీసిన ఆనందంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లకు.. ఇక అదే చివరి వికెట్ అని అర్థమైంది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(152 నాటౌట్; 121 బంతుల్లో, 19×4, 3×6) ఫస్ట్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(123; 96 బంతుల్లో, 11×4, 5×6)తో కలిసి గెలుపునందించారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇన్నింగ్స్ మొత్తాన్ని 7.5 రన్ రేట్ పైనే నడిపించారు. రెండో వికెట్ కు 273 పరుగుల పార్ట్నర్ షిప్ జోడించి మార్టిన్ గప్తిల్, విల్ యంగ్ పేరిట ఉన్న 203 రన్స్ రికార్డును కాన్వే, రచిన్ జోడీ బద్ధలు కొట్టింది. కాన్వే 83 బాల్స్ లో సెంచరీ చేస్తే రవీంద్ర 82 బంతుల్లోనే 100 కంప్లీట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఏ ఒక్కరూ న్యూజిలాండ్ బ్యాటర్లపై ప్రభావం చూపించలేకపోయారు. రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా సెలెక్ట్ అయ్యాడు.