Published 01 Dec 2023
మొన్నటి వరల్డ్ కప్ లో పెద్ద పెద్ద టీమ్ లనే దడదడలాడించిన చిన్న జట్లు.. ఒక్క వన్డేలకే తమ టాలెంట్ పరిమితం కాలేదని నిరూపిస్తున్నాయి. అవకాశమొస్తే ఎలాంటి టీమ్ లనైనా ఓడించడానికి రెడీగా ఉన్నాయి. న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతున్నది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 113 రన్స్ చేసింది. విజయానికి ఆ జట్టు మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లాథమ్(0), కాన్వే(22), తొలి ఇన్నింగ్ సెంచరీ చేసిన విలియమ్సన్(11), నికోల్స్(2), బ్లండెల్స్(6) ఇలా అందరూ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో కివీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. డారెల్ మిచెల్(44 నాటౌట్) టెయిలెండర్లతో పోరాటం చేస్తున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 317 రన్స్ కు ఆలౌటై 7 పరుగుల ఆధిక్యం సాధించింది. నజ్మల్ శాంటో(105) సెంచరీ, ముష్ఫికర్(67), మిరాజ్(50) హాఫ్ సెంచరీలతో సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లా 338కి ఆలౌటై న్యూజిలాండ్ కు 332 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కానీ కివీస్ బ్యాటర్లంతా వెంటవెంటనే ఔటవడంతో ఆ జట్టు ఓటమి దిశగా సాగుతోంది.