వన్డే(ODI) మ్యాచ్ ల్లో మరో ద్విశతకం(Double Century) నమోదైంది. దీంతో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. లంకలో పర్యటిస్తున్న అఫ్గానిస్థాన్ జట్టు.. పల్లెకెలెలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు పాథుమ్ నిశాంక((210 నాటౌట్; 139 బంతుల్లో 20×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో(88), సదీర సమరవిక్రమ(44) సైతం ధాటిగా ఆడటంతో లంక.. 50 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగులు చేసింది.
ఫోర్లు, సిక్స్ లతో గ్రౌండ్ నలువైపులా…
నిశాంక దాడితో లంక టీమ్ 12.1 ఓవర్లలోనే 100 మార్క్ ను అందుకుంది. అతడు 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే.. మరో 50 పరుగుల కోసం 57 బాల్స్ ఆడాడు. కానీ 100 నుంచి 150కు చేరుకునేందుకు మళ్లీ 28 బంతులే తీసుకున్నాడు. ఇక 150 నుంచి డబుల్ సెంచరీ మార్క్ ను అందుకునేందుకు అతడికి కేవలం 20 బాల్సే అవసరమయ్యాయి. నిశాంక ఇన్నింగ్స్ లో 128 పరుగులు ఫోర్లు, సిక్స్ ల ద్వారా వచ్చినవే ఉన్నాయి. శ్రీలంక బ్యాటర్లు ఉతికి ఆరేయడంతో అఫ్గాన్ బౌలర్లు భారీగా రన్స్ సమర్పించుకున్నారు.
పదో ప్రపంచ ప్లేయర్ గా…
వన్డే మ్యాచ్ ల్లో ఇప్పటివరకు 9 మంది డబుల్ మార్క్ ను అందుకుంటే… మొత్తంగా 11 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పుడా ఘనత సాధించిన పదో బ్యాటర్ గా నిశాంక నిలిస్తే.. అతడి డబుల్ తో మొత్తం సంఖ్య 12కు చేరుకుంది. ప్రపంచ క్రికెట్(World Cricket)లో 10 మంది డబుల్ సెంచరీలు చేస్తే అందులో ఐదుగురు భారత ఆటగాళ్లే ఉన్నారు. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అత్యధికంగా మూడు ద్విశతకాల్ని పూర్తి చేయగా హయ్యెస్ట్ రన్స్ రికార్డు అతడి పేరిటే ఉంది.
రికార్డు వీరుల లిస్టు ఇలా…
1. రోహిత్ శర్మ(భారత్) – 264
2. మార్టిన్ గప్తిల్(న్యూజిలాండ్) – 237
3. వీరేంద్ర సెహ్వాగ్(భారత్) – 219
4. క్రిస్ గేల్(వెస్టిండీస్) – 215
5. పాథున్ నిశాంక(శ్రీలంక) – 210 నాటౌట్
6. ఫకర్ జమాన్(పాకిస్థాన్) – 201 నాటౌట్
7. ఇషాన్ కిషన్(భారత్) – 210
8. రోహిత్ శర్మ(భారత్) – 209
9. రోహిత్ శర్మ(భారత్) – 208 నాటౌట్
10. శుభ్ మన్ గిల్(భారత్) – 208
11. గ్లెన్ మ్యాక్స్ వెల్(ఆస్ట్రేలియా) – 201 నాటౌట్
12. సచిన్ టెండూల్కర్(భారత్) – 200 నాటౌట్
Published 09 Feb 2024