
ఆస్ట్రేలియా బ్యాటర్లు(Australia Batters) సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడటంతో పాకిస్థాన్ గజగజ వణికిపోయింది. ఏ ఒక్క బౌలర్నీ లెక్కచేయకుండా ఉతికి ఆరేసిన తీరుతో పాక్ బెంబేలెత్తిపోయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించిన ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163; 124 బంతుల్లో, 14×4, 9×6), మిచెల్ మార్ష్(121; 108 బంతుల్లో, 10×4, 9×6) భారీ సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్లకు 367 రన్స్ చేసింది. నిజంగానే ఈ ఇద్దరూ సిక్సర్లతో పోటీ పడ్డారా అన్నట్లు గ్రౌండ్ కు అన్ని వైపులా షాట్లు బాదారు. 8.2 ఓవర్లలో 50 రన్స్ జత చేసిన ఈ జోడీ.. కేవలం 12.3 ఓవర్లలోనే 100 పార్ట్నర్ షిప్(Partnership) క్రియేట్ చేసింది. ఫస్ట్ ఫిఫ్టీకి 50 బాల్స్ ఆడిన ఈ జంట సెకండ్ ఫిఫ్టీకి కేవలం 27 బంతులే అవసరమయ్యాయి. తొలి వికెట్ కు ఈ జోడీ 259 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేసింది.
చాలా కాలం తర్వాత వార్నర్
డేవిడ్ వార్నర్ చాలా కాలం తర్వాత మునుపటి ఆటను గుర్తు చేశాడు. బాల్ కో పరుగు మార్ష్ చేస్తే వార్నర్ మాత్రం టీ20 తరహాలో హడలెత్తించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ, 85 బాల్స్ లో సెంచరీ, 116 బంతుల్లో 150 ఇలా సాగింది వార్నర్ ఇన్నింగ్స్. ఫోర్లు, సిక్స్ ల ద్వారా వచ్చినవే 110 పరుగులు ఉన్నాయంటే ఎంతగా విరుచుకుపడ్డాడో అర్థమవుతుంది. ఉసామా మిర్, హారిస్ రవూఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడటంతో ఈ ఇద్దరికీ దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. తొలి 3 ఓవర్లలో 17 ఎకానమీతో 54.. 5 ఓవర్లలో 14 ఎకానమీతో రవూఫ్ 70 రన్స్ సమర్పించుకున్నాడు. స్పిన్నర్ ఉసామా 9 ఓవర్లలోనే 82 రన్స్ ఇచ్చుకున్నాడు. మార్ష్ ను ఔట్ చేసిన అఫ్రిది ఆ వెంటనే మ్యాక్స్ వెల్(0) కూడా వెనక్కు పంపి పాకిస్థాన్ కు ఊపిరినిచ్చాడు. స్మిత్(7), జోష్ ఇంగ్లిస్(13), స్టాయినిస్(21), లబుషేన్(8) త్వరత్వరగా ఔటయ్యారు. 400 స్కోరు దాటుతుందనుకున్న ఆసీస్.. చివర్లో బ్యాటర్లు ఆడకపోవడంతో అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయింది. అఫ్రిది 5 వికెట్లు తీయగా, రవూఫ్ కు 3 వికెట్లు దక్కాయి.