
Published 01 DEC 2023
కొత్త తరం ఆటగాళ్ల(Youngsters) రాకతో రిజర్వ్ డ్ ప్లేయర్లతో భారత జట్టు నిండిపోతుంటే.. ఎవర్ని ఎంపిక చేయాలనేది సెలెక్టర్లకు సవాల్ గా మారింది. రానున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టిన BCCI.. ఓపెనర్ల సెలక్షన్ పైనే మల్లగుల్లాలు పడుతున్నది. ఓపెనింగ్ జోడీ కోసం ఐదుగురు ప్లేయర్లు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. రోహిత్ తోపాటు కుర్రాళ్లు శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. ఇందులో రోహిత్ ను మినహాయిస్తే మిగతా నలుగురు ఇప్పటికే తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. వచ్చే ఏడాది జూన్ లో అమెరికా, వెస్టిండీస్ జాయింట్ గా నిర్వహించే టీ20 వరల్డ్ కప్ కు మధ్యలో కేవలం 8 టీ20లు మాత్రమే టీమిండియా ఆడాల్సి ఉంది.

Photo: Espncricinfo
ఐదుగురి మధ్య తీవ్రమైన పోటీ
ఈ ఏడాది ఆగస్టులో పొట్టి ఫార్మాట్ లో అరంగేట్రం చేసిన జైస్వాల్ కు 11 మ్యాచ్ లు ఆడిన అనుభవమే ఉంది. ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లపై ఎటాక్ చేసే ఈ స్ట్రోక్ ప్లేయర్.. లెగ్ స్పిన్నర్ గానూ బంతులు వేస్తాడు. గత వరల్డ్ కప్ వరకు అన్ని టీ20ల్లో కలిపి 132 మంది ఓపెనింగ్ చేస్తే అందులో యశస్వి 167.51 స్ట్రైక్ రేట్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. సంజూ శాంసన్ కు అవకాశాలు లేకపోవడంతో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ జితేష్ శర్మ, రాహుల్ తోపాటు రిషభ్ పంత్ తిరిగివస్తే అతడికి కష్టకాలమే. గత వరల్డ్ కప్ లో 13 మ్యాచ్ ల్లో కేవలం 19.46 యావరేజ్ మాత్రమే సాధించాడు. తొలుత స్లోగా ఆడతాడన్న పేరున్న ఇషాన్ కు మిగతా కీపర్ల నుంచి పోటీ తప్పకపోవచ్చు. అటు 47.37 సగటుతో 166.22 స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్న రుతురాజ్.. మొన్నటి ఆసీస్ మ్యాచ్ లో 57 బంతుల్లోనే 123 రన్స్ చేయడం అతని పరిణతికి నిదర్శనం. కాబట్టి గైక్వాడ్ ఓపెనింగ్ విషయంలో పెద్దగా అనుమానాలు లేకపోవచ్చు. రోహిత్, జైస్వాల్ కన్నా గైక్వాడ్ కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
రోహిత్ కు నో ఛాన్స్.. గిల్ రెడీ
గత ప్రపంచకప్ లో సెమీస్ ఆడిన రోహిత్ అప్పట్నుంచి ఇక పొట్టి ఫార్మాట్ లో అడుగుపెట్టలేదు. హార్దిక్, సూర్య స్టాండ్ కావడంతో అతడికి అవకాశాలు లేనట్లే. టెస్టులు, వన్డేలపైనే రోహిత్ ఇంట్రెస్ట్ చూపుతుండటంతో ఓపెనింగ్ జోడికి అతణ్ని పరిగణలోకి తీసుకోకపోవచ్చు. IPL 2023లో 157.80 స్ట్రైక్ రేట్ తో 890 రన్స్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన గిల్.. ఓపెనర్ రేసులో ముందుంటాడు. అవసరమైతే తొలి బాల్ నుంచి సిక్స్ లు బాదగలడు.. కష్టాల్లో ఉన్నప్పుడు కుదురుగా బ్యాటింగ్ చేయగలడు. అందుకే గిల్ ఓపెనింగ్ రేసులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ప్రతి 16 బాల్స్ కు ఒక సిక్స్ బాదే శుభ్ మన్.. రుతురాజ్, యశస్వితో మాత్రం గట్టిగా పోటీ పడుతున్నాడు. మొత్తంగా రోహిత్ ను మినహాయిస్తే ఈ నలుగురు యంగ్ ప్లేయర్లలో ఎవరిని ఓపెనింగ్ జోడీకి సెలెక్ట్ చేయాలనేది BCCIకి కత్తిమీద సాములా తయారైంది.