27 పరుగులకు ఒక వికెట్.. 47కు చేరుకునే సరికి మూడు.. 70/5… ఇదీ పంజాబ్ కింగ్స్(PBKS) బ్యాటింగ్ తీరు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జట్టును టాప్, మిడిలార్డర్ ఆదుకోలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్(RR) బౌలర్లు తొలి ఓవర్ నుంచే కట్టుదిట్టం(Tight)గా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. ఇన్నింగ్స్ మొత్తం 7 రన్ రేట్(Run Rate) దాటలేదంటే బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థమవుతుండగా.. 8 వికెట్లకు 147 స్కోరే చేసింది.
టపటపా…
ఓపెనర్లు అథర్వ తైదె(15), జానీ బెయిర్ స్టో(15), ప్రభ్ సిమ్రన్(10), శామ్ కరణ్(6), జితేష్ శర్మ(29), శశాంక్ సింగ్(9) ఇలా మెయిన్ ప్లేయర్ల ఆటతీరు చూస్తేనే పంజాబ్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఆరో వికెట్(Sixth Wicket)కు జితేశ్, లివింగ్ స్టోన్(21) జోడీ అందించిన 33 పరుగుల పార్ట్నర్ షిపే హయ్యెస్ట్ కావడం ఆ జట్టు దయనీయ స్థితికి అద్దం పట్టింది.
చివరకు జితేష్ శర్మ, లివింగ్ స్టోన్ అవుట్ కావడంతో పంజాబ్ మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే చివర్లో అశుతోష్ శర్మ(31; 16 బంతుల్లో 1×4, 3×6) విజృంభించాడు. 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదడంతోపాటు మొత్తం 18 రన్స్ పిండుకున్నాడు. ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.