హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీల మోత మోగింది. పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరిగిన వన్డేలో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో పాకిస్థాన్ అనూహ్య విజయం సాధించింది. లంక తరఫున కుశాల్, సమరవిక్రమ దుమ్ముదులిపితే ఛేదనలో పాకిస్థాన్ అసమాన పోరాటం కనబరిచింది. ఓపెనర్ అబ్దుల్లా, కీపర్ రిజ్వాన్… సెంచరీలతో భారీ టార్గెట్ ను ఛేదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 రన్స్ చేసింది. పాథున్ నిశాంక(51; 61 బంతుల్లో, 7×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్(122; 77 బంతుల్లో, 14×4, 6×6), సదీర సమరవిక్రమ(108; 89 బంతుల్లో, 11×4, 2×6) సెంచరీలతో హోరెత్తించారు. పాకిస్థాన్ బౌలింగ్ ను ఆటాడుకున్నారు. అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రవూఫ్ తోపాటు బౌలర్లందరినీ ఉతికి ఆరేశారు.
అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన పాక్ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 345 రన్స్ చేసి 6 వికెట్లతో విజయం సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్(113; 103 బంతుల్లో, 10×4, 3×6), రిజ్వాన్(131 నాటౌట్; 121 బంతుల్లో, 8×4, 3×6) సెంచరీలు చేశారు. పాక్ ను గెలిపించిన రిజ్వాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.