ఆ చిన్నోడు… సంచలనాలకు మారుపేరు. ఎత్తు వేశాడంటే ప్రత్యర్థి చిత్తే అన్నట్లుగా ఆడతాడు. అలా ఇలా కాదు.. ఏకంగా వరల్డ్ ఛాంపియన్ నే ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 18 ఏళ్ల ప్రాయంలోనే అపార ప్రతిభను చాటి తానేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. దేశం గర్వించే స్థాయికి ఎదిగిన ప్రజ్ఞానంద గురించి ఇంతకన్నా చెప్పేదేముంటుంది. చిన్న వయసులోనే సంచలనాలతో సాగుతున్న భారత యువ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద.. పోరాటాన్ని ముగించాడు. కార్ల్ సన్ కు చుక్కలు చూపించిన ఈ యువ కెరటం.. ఆయన ఎక్స్ పీరియన్స్ కి తలవంచక తప్పలేదు. ప్రజ్ఞానంద చివరకు ప్రెజర్ కు గురవడంతో దాన్ని అనుకూలంగా మలచుకున్న మాగ్నస్ కార్ల్ సన్.. ఫిడే చెస్ వరల్డ్ కప్ ఛాంపియన్ గా అవతరించాడు. ఫైనల్ ను ప్రజ్ఞానంద టై బ్రేక్ వరకు తీసుకెళ్లాడు.
ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడని భావించిన ఈ భావి భారత ప్లేయర్.. రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. అయినా కోట్లాది మంది భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. అపార అనుభవమున్న కార్ల్ సన్ ను ముప్పుతిప్పలు పెట్టాడు ప్రజ్ఞానంద. రన్నరప్ గా నిలిచినా తన ఆటతీరుతో మాత్రం అందరి మనసుల్ని దోచాడు.