తొలి మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి వరుసగా రెండు సార్లు(బెంగళూరు, లఖ్ నవూ) ఓటములు మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings).. నాలుగో మ్యాచ్ లో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్ లో 70 రన్స్ కే నాలుగు వికెట్లు పడ్డా భయపడలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 199 పరుగులు చేస్తే శశాంక్ సింగ్ ఒంటరి పోరాటంతో పంజాబ్ దాన్ని దాటేసింది.
కెప్టెన్స్ ఇన్నింగ్స్…
ఓపెనర్ శుభ్ మన్ గిల్(Shubhman Gill) సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ తో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(11) ఔటైనా విలియమ్సన్(26), సాయి సుదర్శన్(33; 19 బంతుల్లో 6×4) అండతో గిల్ రెచ్చిపోయాడు. గిల్(85; 45 బంతుల్లో 6×4, 4×6) మరింత దూకుడు పెంచాడు. విజయ్ శంకర్(8) మరోసారి నిరాశపరిస్తే రాహుల్ తెవాతియా(23; 8 బంతుల్లో 3×4, 1×6)తో గిల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు.
పంజాబ్ పోరాటం…
ఫామ్ లో ఉన్న ధావన్(1), బెయిర్ స్టో(22), ప్రభ్ సిమ్రన్(35), శామ్ కరణ్(5)… ఇలా 70 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డా పంజాబ్ తొణకలేదు. ఒకవైపు కొలీగ్స్ వరుసగా క్యూ కడుతున్నా తన పోరాటాన్ని మాత్రం శశాంక్ విడిచిపెట్టలేదు. ఎదురుగా వికెట్లు పడుతున్నా ఫోర్లు, సిక్స్ లు బాదడం మానలేదు. 19.5 ఓవర్లలో 200 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.