మొదట కోల్ కతా బ్యాటర్లు కొట్టినవి 18 సిక్స్ లు.
తర్వాత ఛేజింగ్ లో పంజాబ్ బాదినవి 24 సిక్స్ లు.
ఒకే మ్యాచ్ లో రికార్డయిన సిక్స్ లు 42…
మొత్తంగా రెండు జట్లలో బలైంది మాత్రం బౌలర్లే.
బౌలర్లను చితకబాదుతూ కోల్ కతా నైట్ రైడర్స్(KKR) బెంబేలెత్తిస్తే… తానేం తక్కువ కాదంటూ దీటుగా ప్రతాపం చూపించింది పంజాబ్ కింగ్స్(PBKS). ఇరు జట్ల పోటాపోటీ బ్యాటింగ్ తో స్టేడియం హోరెత్తింది. అలవోకగా(Very Easy) కొట్టిన సిక్స్ లు చూస్తే బ్యాటింగ్ ఇంత సులువా అనిపించింది. KKR 261/6 చేస్తే లక్ష్య ఛేదనలో PBKS దడదడలాడించింది. బ్యాటర్ల విధ్వంసంతో 18.4 ఓవర్లలోనే 262/2 చేసి 8 వికెట్ల తేడాతో ఊహించని భారీ విజయం సాధించింది.
తొలుత KKR…
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్ కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్(75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్(71; 32 బంతుల్లో 9×4, 4×6), వెంకటేశ్ అయ్యర్(39; 23 బంతుల్లో 3×4, 2×6), అండ్రీ రసెల్(24; 12 బంతుల్లో 2×4, 2×6), శ్రేయస్ అయ్యర్(28; 10 బంతుల్లో 1×4, 3×6)… ఐదుగురు బ్యాటర్లు ఇలా దంచికొట్టడంతో ఆ టీమ్ భారీ స్కోరు చేసింది.
అలా మొదలైంది…
అచ్చం కోల్ కతా మాదిరిగానే పంజాబ్ బ్యాటింగ్ నడిచింది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్(54; 20 బంతుల్లో 4×4, 5×6), జానీ బెయిర్ స్టో(108; 48 బంతుల్లో 8×4, 9×6) దొరికిన బాల్ ను దొరికినట్లు బాదారు. ప్రభ్ సిమ్రన్ కేవలం 18 బాల్స్ లోనే 4 ఫోర్లు, 5 సిక్స్ లతో హాఫ్ సెంచరీ చేశాడు. అటు బెయిర్ స్టో 23 బంతుల్లో 50 చేసిన తర్వాత మరింత రెచ్చిపోయాడు. సిక్స్ లు కొట్టడం ఇంత ఈజీయా అన్నట్టుగా ఆడుతూ 45 బంతుల్లోనే 100 పూర్తి చేశాడు.
మరో ఎండ్ లో శశాంక్ సింగ్(68; 28 బంతుల్లో 2×4, 8×6) తన బ్యాటింగ్ తో బెయిర్ స్టోను మరిపించాడు. ఓవర్ కు 13కు పైగా రన్ రేట్ మెయింటెయిన్ చేశారంటే పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. బెయిర్ స్టో కొట్టిన ఒక సిక్స్ 105 మీటర్ల దూరం వెళ్లి రికార్డు క్రియేట్ చేసింది.