
‘రచిన్ రవీంద్ర’… వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ న్యూజిలాండ్ కుర్రాడు. సీనియర్ బ్యాటర్ డెవాన్ కాన్వేకు దీటుగా 11 ఫోర్లు, 5 సిక్స్ లతో 93 బాల్స్ లోనే 123 రన్స్ చేయడంతోపాటు బౌలింగ్ లో ఒక వికెట్ తీసుకుని ఔరా అనిపించాడు. 152 రన్స్ చేసిన కాన్వేను పక్కనపెట్టి ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రచిన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కట్టబెట్టారంటేనే ఈ చిన్నోడి ఆటతీరు ఎలా ఉుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రచిన్ రవీంద్ర కేవలం భారత సంతతి వాడే కాకుండా తన పేరులోనూ ఇద్దరు భారత క్రికెటర్లు ఉండేలా ఆయన తండ్రి చూసుకున్నారట. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ అంటే బాగా ఇష్టపడే రవీంద్ర తండ్రి… కుమారుడు పుట్టగానే రాహుల్ లోని(‘ర’), సచిన్ లోని(‘చిన్’) కలిసి వచ్చేలా ఫస్ట్ నేమ్ రచిన్ అని పెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా ఈ కుర్రాడే బయటపెట్టాడు. ఏ ముహూర్తాన అతడికి ఆ పేరు పెట్టాడో కానీ నిజంగా ఆ ఇద్దరు ఆటగాళ్ల మాదిరిగానే ఇంగ్లండ్ తో మ్యాచ్ లో రచిన్ బ్యాటింగ్ సాగింది. రాహుల్ మాదిరిగా కళాత్మక షాట్లు ఆడుతూనే సచిన్ లా దూకుడైన బ్యాటింగ్ తో ఇంగ్లిష్ బౌలర్లను ఆటాడుకున్నాడు.
బెంగళూరు నుంచి న్యూజిలాండ్ కు
రచిన్ తల్లిదండ్రులిద్దరూ భారతీయులే. బెంగళూరుకు చెందిన ఈ కుటుంబం న్యూజిలాండ్ లో స్థిరపడింది. కివీస్ అండర్-19 తరఫున 2016 వరల్డ్ కప్ జట్టులో తొలిసారి రవీంద్ర చోటు దక్కించుకున్నాడు. ఆ టోర్నీలో చూపిన ప్రతిభ ఆధారంగా వరుసగా రెండో ప్రపంచకప్ అయిన 2018 అండర్-19 టీమ్ లోనూ చోటు నిలుపుకొన్నాడు. ఇక అంతర్జాతీయ మ్యాచ్ ల్లోనూ అరంగేట్రం చేసే అవకాశం ఈ భారత సంతతి కుర్రాడికి అతి తొందరగానే దక్కింది. 2021లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ద్వారా టీ20ల్లో అడుగుపెట్టిన రవీంద్ర.. అనతికాలంలోనే టెస్టు జట్టుకూ సెలెక్ట్ అయ్యాడు. అయితే వన్డేల్లో చోటు కోసం మరో రెండేళ్లు అంటే 2023 వరకు వేచిచూడక తప్పలేదు. ఇప్పటివరకు రచిన్ 3 టెస్టులు, 12 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. చిన్నప్పట్నుంచి టెండూల్కర్ మ్యాచ్ ల రీప్లేల్ని బాగా గమనించేవాడట. తను లెఫ్ట్ హ్యాండర్ కావడంతో బ్రియాన్ లారా, కుమార సంగక్కర అంటే బాగా ఇష్టమని, వారిద్దరి ఆటను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడినన్నాడు రచిన్.