
నాలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉందని, ఇప్పటికీ యంగ్ గానే ఉన్నానని టీమ్ ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ అంజిక్య రహానే అన్నాడు. వెస్టిండీస్ సిరీస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజీగా తీసుకోబోమన్నాడు. ‘సొంతగడ్డపై విండీస్ ప్రమాదకరమైన జట్టు… ఈ మధ్య కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నంత మాత్రాన ఆ టీమ్ ను తేలిగ్గా తీసుకునేదే లేదు… టీమ్ ఇండియా 100 శాతం విజయం కోసం శ్రమిస్తుంది.. నాలుగైదేళ్లుగా వైస్ కెప్టెన్ గా ఉన్నాను… ఇప్పుడు విండీస్ కు వైస్ కెప్టెన్ గా తొలి టూర్ కు వెళ్తున్నాం.. ఆట పరంగా విండీస్ ను గౌరవిస్తూనే వారిని ఓడించడానికి మంచి ప్రిపరేషన్ లో ఉన్నాం’ అని తెలిపాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జర్నీని ఈ విండీస్ టూర్ నుంచే టీమ్ ఇండియా స్టార్ట్ చేయనుంది. మొన్నటి IPL 15 మ్యాచ్ ల్లో 48.07 యావరేజ్ తో 625 రన్స్ చేసి నేషనల్ టీమ్ కు ఎంపికైన యశస్వి జైస్వాల్ పై రహానే ప్రశంసలు కురిపించాడు. చెతేశ్వర్ పుజారా ఆబ్సెంట్ లో తాను థర్డ్ నంబరు బ్యాటర్ గా వచ్చే అవకాశం ఉండొచ్చని వివరించాడు. తనలోని సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ బయటకు తెచ్చుకోవడానికి IPL వేదికగా నిలిచిందని, మొదట్నుంచి బౌలర్లపై డామినేషన్ చూపించడానికి అదే కారణమని రహానే అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో పనిచేయడం బాగుంటుందని, తన తొలి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను రోహిత్ ఆధ్వర్యంలోనే ఆడానని గుర్తు చేసుకున్నాడు.