కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్ గా సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. బెంగళూరులో నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న టీమిండియా.. 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(61; 54 బంతుల్లో 8×4, 2×6), శుభ్ మన్ గిల్(51; 32 బంతుల్లో 3×4, 4×6) తొలి వికెట్ కు దడదడలాడించారు. ఈ ఇద్దరూ ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డారు. వీరి తర్వాత కోహ్లి(51; 56 బంతుల్లో 5×4, 1×6) ఔటైనా.. శ్రేయస్, రాహుల్ వీర ప్రతాపం చూపించారు. మొత్తంగా ఇద్దరి సెంచరీలు, ముగ్గురి హాఫ్ సెంచరీలతో భారత్.. ఈ టోర్నీలోనే హయ్యెస్ట్ స్కోరు నమోదు చేసింది.
స్పిన్నర్ తో బౌలింగ్ స్టార్ట్
స్పిన్నర్ ఆర్యన్ దత్ తో బౌలింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్.. ఫస్ట్ 10 ఓవర్లలోనే 91 పరుగులు సమర్పించుకుంది. ప్రతి దశలోనూ రోహిత్ సేన ఎక్కడా తగ్గని రీతిలో 7 రన్ రేట్ కు పైగానే చేసింది. శ్రేయస్(128 నాటౌట్; 94 బంతుల్లో 10×4, 5×6) చివరి ఓవర్లలో సిక్స్, ఫోర్లతో నెదర్లాండ్స్ ఉతికి ఆరేశాడు. అటు 40 బాల్స్ లో 7 ఫోర్లతో 50 పూర్తి చేసుకున్న రాహుల్.. హాఫ్ సెంచరీ తర్వాత బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. రాహుల్ (102; 63 బంతుల్లో 11×4, 4×6) ఊచకోత కోశారు. 50 నుంచి 100కు చేరుకోవడానికి రాహుల్ కేవలం 22 బంతులే అవసరమయ్యాయంటే ఎంత వేగంగా రన్స్ తీశాడో అర్థమవుతున్నది. 10 ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న వాన్ బీక్ 107, మీకేరన్ 90, డిలీడ్ 82 పరుగులు ఇచ్చుకున్నారంటే భారత్ బ్యాటింగ్ ఎంత ధాటిగా సాగిందో తెలుసుకోవచ్చు.