భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా నిలిచిపోయింది. శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో జోరుగా స్కోరు పెరుగుతున్న దశలో వాన అడ్డుపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండౌర్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 16 రన్స్ వద్ద రుతురాజ్ గైక్వాడ్(8).. హేజిల్ వుడ్ బౌలింగ్ లో కీపర్ క్యారీ క్యాచ్ ఇచ్చాడు. మూడో నంబర్ బ్యాటర్ గా క్రీజులోకి వస్తూనే శ్రేయస్ అయ్యర్.. దుమ్ము దులిపాడు. వరుస ఫోర్లతో హడలెత్తించగా మరో ఎండ్ లో గిల్ సైతం ఫామ్ కంటిన్యూ చేశాడు. వచ్చీ రాగానే జాన్సన్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టగా.. అటు హేజిల్ వుడ్ ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు సాధించాడు. అయ్యర్, గిల్ మరో ఫోర్ కొట్టడంతో భారత్ స్కోరు 7.3 ఓవర్లలోనే 50 కి చేరుకుంది.
ఇక అక్కణ్నుంచి గిల్ జోరు స్టార్ట్ అయింది. 9వ ఓవర్ లో అబాట్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ బాదాడు. 29 బంతుల్లోనే గిల్, అయ్యర్ జోడీ 50 పార్ట్నర్ షిప్ ను జోడించింది. ఆట నిలిపివేసే సమయానికి టీమ్ఇండియా 9.5 ఓవర్లలో 79/1 రన్స్ చేసింది. కొద్దిసేపటికే వర్షం తగ్గిపోవడంతో గ్రౌండ్ ను అంపైర్లు పరిశీలించారు. కొద్దిసేపట్లో మ్యాచ్ తిరిగి మొదలయ్యే అవకాశముంది.