వారెవ్వా IPL అనే రీతిలో సెంచరీల మోత మోగిస్తున్నారు ప్లేయర్లు. మూడు రోజుల వ్యవధి(Time)లోనే నలుగురు సెంచరీలు చేయడం ఈ ఐపీఎల్ సీజన్ ఊపును మరింత పెంచింది. నిన్న హైదరాబాద్-బెంగళూరు కొదమసింహాల్లా పోరాడితే ఇవాళ అదే సీన్ రాజస్థాన్-కోల్ కతా మధ్య కనిపించింది. మొత్తంగా క్రికెట్ ప్రేమికులకు మాత్రం పసందైన ఆటతీరు కనపడుతున్నది.
ముందు బ్యాటింగ్, తర్వాత బౌలింగ్ తో ఆల్ రౌండ్(All Round) షో చూపించినా కోల్ కతా నైట్ రైడర్స్(KKR) ఆటల్ని సాగనివ్వలేదు రాజస్థాన్ రాయల్స్. పాయింట్స్ టేబుల్లో తన టాపర్ స్థానానికి ఢోకా లేదన్న రీతిలో సెకండ్ ప్లేస్ లో ఉన్న నైట్ రైడర్స్ ని ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన నైట్ రైడర్స్.. 6 వికెట్లకు 223 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ అయినా వెరవకుండా చివరి వరకు పోరాటం చేసిన రాజస్థాన్.. లక్ష్యాన్ని అందుకుంది. 8 వికెట్లకు 224 రన్స్ చేసి 2 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జోస్ బట్లర్(107; 60 బంతుల్లో 9×4, 6×6) సెన్సేషనల్ ఆటతీరుతో రాజస్థాన్ అపూర్వ విజయాన్ని దక్కించుకుంది. అటు సెంచరీ, ఇటు రెండు వికెట్లతో మ్యాచ్ ను సునీల్ నరైన్ శాసించినా రాయల్స్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. KKR తరఫున నరైన్ సెంచరీ చేస్తే అందుకు ప్రతీకారంగా RR నుంచి బట్లర్ 100 మార్క్ ను పూర్తి చేశాడు.
బట్లర్ భలే…
భారీ రన్స్ ఛేజింగ్ కు దిగిన RRకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ బట్లర్ భారీ విన్యాసంతో ఆ జట్టుకు తిరుగులేకుండా పోయింది. జైస్వాల్(19), శాంసన్(12).. ఇలా 47 స్కోరుకే 2 వికెట్లు పడ్డాయి. రియాన్ పరాగ్(34; 14 బంతుల్లో 4×4, 2×6) కొద్దిసేపు గట్టిగా ఆడినా కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత జురెల్(2), అశ్విన్(8), హెట్ మయర్(0), పావెల్(26; 13 బంతుల్లో 1×4, 3×6) వెంటవెంటనే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది.
186/8తో ఉన్న జట్టును నడిపించే ప్రయత్నం చేశాడు బట్లర్. ఈ ఇంగ్లండ్ ప్లేయర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. అవేశ్ ఖాన్ ను నాన్ స్ట్రైకింగ్ కే పరిమితం చేసి ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.