ఇంగ్లండ్ తో రాజ్ కోట్(Rajkot)లో జరుగుతున్న మూడో టెస్టులో తొలిరోజు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్.. రెండో రోజు అంత తేలిగ్గా తలవంచలేదు. బ్యాటర్లు బాగా ఆడటంతో మంచి స్కోరు సాధించింది. 5 వికెట్లకు 326 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా… ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా(112; 225 బంతుల్లో 9×4, 2×6) ఓవర్ నైట్ స్కోరుకు మరో రెండు రన్స్ మాత్రమే జోడించి ఔటయ్యాడు. నైట్ వాచ్ మన్ గా వచ్చిన కుల్దీప్ యాదవ్(4).. అంతకు కొద్దిముందే వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 రన్స్ కు ఆలౌటయింది.
అరంగేట్ర ప్లేయర్లతో…
ఇలా ఇద్దరూ వెంటవెంటనే ఔట్ కావడంతో… భారత ఇన్నింగ్స్ ముగుస్తుందా అన్న అనుమానం ఏర్పడింది. కానీ మరో ఇద్దరు ఆటగాళ్లు తమ పట్టుదలతో.. టీమ్ఇండియాను ఉన్నతస్థితిలో నిలిపారు. ఆట తొలిరోజు(Starting Day) నాడు తన తొలి మ్యాచ్ లోనే సర్ఫరాజ్ ఖాన్ దుమ్ముదులిపితే.. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ సైతం ఓపికగా నిలబడి రన్స్ తీశాడు.
ఆ ఇద్దరి జోడీతో…
331 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను.. రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు. వికెట్ కీపర్ జురెల్(46) కన్నా ముందుగానే క్రీజులోకి వచ్చిన అశ్విన్(37).. అనుకున్నట్లుగానే తన సీనియారిటీని చూపించాడు. ఈ ఇద్దరూ మంచి భాగస్వామ్యం(Partnership) జోడించడంతో భారత్ 400 పరుగుల మార్క్ ను దాటింది. ఆడిన తొలి మ్యాచ్ లోనే సహనాన్ని చూపిన జురెల్.. హాఫ్ సెంచరీ చేయకుండానే ఔటయ్యాడు.
చివరకు జస్ ప్రీత్ బుమ్రా చివర్లో బ్యాట్ తో అదరగొట్టాడు. 3 ఫోర్లు, ఒక సిక్స్ తో 28 బాల్స్ లోనే 26 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరగడంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీసుకోగా.. రెహాన్ అహ్మద్ 2, అండర్సన్, హార్ట్ లీ, రూట్ ముగ్గురూ తలో వికెట్ చొప్పున దక్కించుకున్నారు.