రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్ గా మరోసారి విరాట్ కోహ్లి బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీమ్ యాజమాన్యం(Management) సమాలోచనలు జరుపుతున్నది. ప్రస్తుత కెప్టెన్ అయిన 40 ఏళ్ల ఫెఫ్ డుప్లెసిస్ కు వయసు మీద పడటంతో అతని కెప్టెన్సీ 2022-24కే పరిమితం కానుంది. IPL చరిత్రలో ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ గెలవని RCB.. నెల రోజుల్లో జరిగే మెగా వేలంలో కీలక ఆటగాళ్లను చేర్చుకోవాలని భావిస్తున్నది. శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ నాయకత్వాల పైనా దృష్టిపెట్టిన బెంగళూరు.. ఆ ఇద్దరి కంటే కోహ్లియే సమర్థుడన్న భావనకు వచ్చింది.
2013 నుంచి 2021 వరకు కోహ్లి నేతృత్వంలోని RCB నాలుగు సార్లు ప్లేఆఫ్స్ చేరింది. 2016లో కప్ కు చేరువగా వచ్చినా ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) చేతిలో ఓడింది. దీంతో అతడు కాస్తా 2021లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇక ఇంటర్నేషనల్ టీ20ల్లోనూ రోహిత్ తోపాటు తప్పుకున్న విరాట్.. IPL-2025 సీజన్లోనూ బెంగళూరుకు ఆడనున్నాడు. ‘IPLలో చివరి గేమ్ ఆడేవరకు RCBతోనే ఉంటా.. గత తొమ్మిదేళ్లలో అసహనం, బాధ, సంతోషాల్ని చూశా.. నన్ను ముందునుంచీ నమ్మి విశ్వాసం ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు..’ అని విరాట్ అన్నాడు.