ప్రత్యర్థి తమ ఎదుట ఉంచిన టార్గెట్… 108 పరుగులు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి జట్టంతా(Team) ఆ స్కోరు చేస్తే… ఆమె మాత్రం ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడింది. మహోగ్ర రూపంతో సాగించిన బ్యాటింగ్ తో.. గెలుపు ఘనంగా దక్కింది. ఫస్ట్ ఓవర్లోనే మూడు ఫోర్లు బాదితే.. తొలి మూడు ఓవర్లలో వచ్చిన మొత్తం 7 ఫోర్లలో ఆరు ఆమెవే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు… స్మృతి మంధాన బ్యాటింగ్ ఎలా సాగిందో. మహిళల IPLలో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 107 పరుగులు చేస్తే.. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని పొందింది. తొలుత గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 107 పరుగులు చేస్తే.. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగళూరు 12.3 ఓవర్లలో 110 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని పొందింది.
గుజరాత్ విలవిల…
టాస్ గెలిచిన RCB.. గుజరాత్ జెయింట్స్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఏ ఒక్కరూ గట్టిగా నిలబడకపోవడంతో మొత్తం ఓవర్లు ఆడినా ఆ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. దయాలన్ హేమలత(31 నాటౌట్) హయ్యెస్ట్ స్కోరర్ కాగా.. ఓపెనర్ హర్లీన్ డియోల్(22) తర్వాతి స్థానంలో నిలిచింది. కెప్టెన్ బెత్ మూనీ(8), ఫోబీ లిచ్ ఫీల్డ్(5), వేద కృష్ణమూర్తి(9), ఆష్లే గార్నర్(7), కథ్రీన్ బ్రైస్(3), స్నేహ్ రాణా(12) ఇలా వచ్చి అలా వెళ్లారంతే. సోఫీ మాలినెక్స్ 3, రేణుకా సింగ్ 2, జార్జియా వేరమ్ ఒక వికెట్ తీసుకుంది.
బెంగళూరు ధనాధన్…
ఉన్న చిన్న లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసినట్లుగా సాగింది బెంగళూరు బ్యాటింగ్. స్మృతి మంధాన(43; 27 బంతుల్లో 8×4, 1×6) ధనాధన్ బ్యాటింగ్ తో గుజరాత్ పరిస్థితి దయనీయంగా మారింది. ఈమె దూకుడుతో తొలి ఐదు ఓవర్లలోనే 9 రన్ రేట్ తో 45 రన్స్ వచ్చాయి. చివరకు ఆమె హాఫ్ సెంచరీ మార్క్ అందుకోకున్నా అప్పటికే గుజరాత్ జెయింట్స్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు వికెట్లు పడ్డా బెంగళూరు స్పీడ్ ఎక్కడా ఆగలేదు. సబ్బినేని మేఘన సైతం దుమ్ముదులిపింది. సబ్బినేని మేఘన(36; 28 బంతుల్లో 5×4, 1×6), ఎలిసా పెర్రీ(23; 14 బంతుల్లో 4×4) సైతం దుమ్ముదులపడంతో సునాయాసం(Easy)గా RCB విజయాన్ని దక్కించుకుంది.