మొన్న హైదరాబాద్ ఆటగాళ్ల బ్యాటింగ్ తో ఉప్పల్ ఊగిపోతే… ఈరోజు బెంగళూరు స్టేడియం హోరెత్తిపోయింది. ఇంతవరకు సొంతగడ్డపైనే వీర ప్రతాపం చూపిన సన్ రైజర్స్ ఆటగాళ్లు(Players) పొరుగు గడ్డపైనా వీరత్వాన్ని ప్రదర్శించారు. వచ్చినవాళ్లు వచ్చినట్లుగా, నచ్చినట్లుగా బాదటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చేతులెత్తేసింది.
బ్యాటర్ల మహిమ…
సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) టీమ్ లో ఐదుగురు బ్యాటింగ్ కు వస్తే ఆ ఐదుగురూ వీరబాదుడు బాదారు. ట్రావిస్ హెడ్(102; 41 బంతుల్లో 9×4, 8×6), అభిషేక్ శర్మ(34; 22 బంతుల్లో 2×4, 2×6), క్లాసెన్(67; 31 బంతుల్లో 2×4, 7×6), మార్ క్రమ్(32; 17 బంతుల్లో 2×4, 2×6), అబ్దుల్ సమద్(37; 10 బంతుల్లో 4×4, 3×6) ఉతుకుడుతో ముంబయిపై 277 పరుగుల రికార్డును తుడిచిపెడుతూ మరో 10 పరుగులు అదనంగా జత చేసి 287/3 చేసింది హైదరాబాద్.
ప్రపంచ రెండో రికార్డు…
11 ఏళ్ల నాటి రికార్డును మొన్న ముంబయిపై బద్ధలు కొట్టిన SRH… ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసింది. 2013లో RCBపై నెలకొల్పిన 263/5 రికార్డును ముంబయిపై ఈ మార్చి 27న 277 స్కోరు చేసి తుడిచిపెట్టింది. ఇప్పుడు ఆ రికార్డును మరోసారి సవరించుకుని కొత్త చరిత్రను లిఖించింది. ఇక 287 స్కోరు ప్రపంచ టీ20 చరిత్రలో రెండో హయ్యెస్ట్ స్కోరుగా నిలిచింది.
2023 సెప్టెంబరు 27న మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో నేపాల్ టీమ్ 3 వికెట్లకు 314 రన్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు హైదరాబాద్ స్కోరుది సెకండ్ ప్లేస్ కాగా… అఫ్గానిస్థాన్ ఐర్లాండ్ పై 278/3తో.. చెక్ రిపబ్లిక్ టీమ్ టర్కీపై 278/4 స్కోరు చేసి సంయుక్తంగా మూడో స్థానానికి పడిపోయాయి. మొత్తంగా 22 సిక్స్ లు కొట్టిందీ మ్యాచ్ లో SRH.