రిషభ్ పంత్ టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడటంతో సిడ్నీ టెస్టులో వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 78 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డ జట్టును ముందుండి నడిపించే ఆట ఆడాడు. బ్యూ వెబ్ స్టర్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డు చకచకా కదిలింది. అంతకుముందు 4 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమ్ఇండియా.. మరోసారి టాప్ ఆర్డర్ వైఫల్యంతో కష్టాల్లో పడింది. జైస్వాల్(22), రాహుల్(13), గిల్(13), కోహ్లి(6) తక్కువకే వికెట్లు సమర్పించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విరుచుకుపడ్డ బోలాండ్.. మూడు ప్రధాన వికెట్లు తీసుకున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో క్రీజులో అడుగుపెట్టిన పంత్(61).. జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నడిపించే ప్రయత్నం చేశాడు. కేవలం 29 బంతుల్లోనే అతడు 6 ఫోర్లు, 3 సిక్సులతో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మరో రెండు సిక్సర్లు బాదినా ఆ తర్వాతి ఓవర్లో కమిన్స్ వేసిన అద్భుత బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నితీశ్(4) మరోసారి నిరాశపరచడంతో 129 స్కోరుకే భారత్ 6 వికెట్లు చేజార్చుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి మొత్తంగా 145 రన్స్ ఆధిక్యంలో ఉంది.