భారత టెన్నిస్ టాప్ ప్లేయర్ రోహన్ బోపన్న డెవిస్ కప్ కెరీర్ కు ముగింపు పలకబోతున్నాడు. సెప్టెంబరులో మొరాకోతో జరిగే టోర్నీతో ఫుల్ స్టాప్ పెడతానని ప్రకటించాడు. మొరాకోతో పోరును ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహించాలని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో ఈ కర్ణాటక ఆటగాడు తన వీడ్కోలు మ్యాచ్ ను సొంతగడ్డపై ఆడే వీలు లేకుండా పోయింది. సెప్టెంబరులో జరిగే వరల్డ్ గ్రూప్ II టైలో మొరాకోతో భారత్ ఆడాల్సి ఉంది. 43 ఏళ్ల బోపన్న 2002లో డెవిస్ కప్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్నుంచి ఏటీపీ టూర్లలో భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు. దేశం తరఫున 32 టోర్నీల్లో పాల్గొని సత్తా చాటాడు.
వరల్డ్ నంబరు… 3
సింగిల్స్ కెరీర్ లో 213వ ర్యాంకుకు పరిమితమైన బోపన్న… డబుల్స్ లో మాత్రం అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించాడు. 2013 జులైలో డబుల్స్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరుకున్నాడు. గాబ్రియెల్ డబ్రోవ్ స్కీతో మిక్స్ డ్ డబుల్స్ లో జట్టుకట్టి 2017లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. తద్వారా గ్రాండ్ స్లామ్ టోర్నీ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పాక్ ప్లేయర్ అయిసమ్-ఉల్-హక్ ఖురేషి జోడీగా 2007లో 4 ఛాలెంజర్స్ టైటిల్స్ గెలవడంతో బోపన్న-ఖురేషి జంట ఇండో-పాక్ ఎక్స్ ప్రెస్ గా ఫేమస్ అయింది. 2010లో టాప్ టెన్ కు చేరిన ఈ జంట.. అదే ఏడాది జరిగిన వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడంతోపాటు US ఓపెన్ రన్నరప్ గా నిలిచింది. 2011, 2012లో పారిస్ మాస్టర్స్ టోర్నీలు గెలిచిన ఈ టాప్ ప్లేయర్.. 5 మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. కెరీర్లో 24 టైటిళ్లు సాధించిన బోపన్న ప్రస్తుతం 11వ ర్యాంకులో ఉన్నాడు.