మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి మరో రెండు మ్యాచ్ ల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐదో మ్యాచ్ లో ప్రతాపం చూపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన UP వారియర్స్.. ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లకు 175 రన్స్ చేసింది. దీంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది.
దంచికొట్టిన బెంగళూరు…
ఓపెనర్ స్మృతి మంధాన(80; 50 బంతుల్లో 10×4, 3×6) దంచికొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఎలిసే పెర్రీ(58), సబ్బినేని మేఘన(28), రిచా ఘోష్(21) రాణించడంతో ఆ టీమ్.. పెద్ద లక్ష్యాన్ని యూపీ ముందు ఉంచింది. ముఖ్యంగా అదుర్స్ అన్న రీతిలో మంధాన విరుచుకుపడింది. ఆమె స్పీడ్ చూస్తుంటే సెంచరీ కూడా కొట్టేయగలదని అనుకున్నారు. కానీ చివర్లో షాట్ కు యత్నించి క్యాచ్ ఇచ్చి అవుటయింది.
యూపీది పోరాటమే…
తొలి ఓవర్ మెయిడెన్.. కానీ మూడో ఓవర్ పూర్తయ్యే సరికి స్కోరు 40. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు ఆ రెండు ఓవర్లలో ఎంతటి విధ్వంసం జరిగిందో. బెంగళూరు విసిరిన భారీ టార్గెట్ ను ఛేదించేందుకు ఓపెనర్లు అలిసా హీలీ, కిరణ్ నవ్ గిరె ఆడిన తీరిది. అలా ఐదారు ఓవర్ల పాటు 10కి పైగా రన్ రేట్(Run Rate)తో సాగినా చివరకు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది యూపీకి. అలీసా హీలీ(55), దీప్తి శర్మ(33), పూనమ్ ఖెమ్నర్(31) కొద్దిసేపు నిలబడ్డా టార్గెట్ రీచ్ చేయడంలో వెనుకబడిపోయారు.
‘పంచ్’ పడింది…
బెంగళూరు బ్యాటింగ్ లో విచిత్రం చోటుచేసుకుంది. వన్ డౌన్ బ్యాటర్ ఎలిసే పెర్రీ కొట్టిన షాట్ కు.. గ్రౌండ్ లో ఉంచిన టాటా పంచ్ కారు అద్దం(Glass) పగిలింది(Break). ఆమె కొట్టిన షాట్ నేరుగా కారు కుడివైపున గల బ్యాక్ గ్లాస్ కు తగిలింది.