
Published 28 Nov 2023
టీ20 అంటే.. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేసేవాళ్లుంటారు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ స్కోరు చేసేలా బాదుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఎప్పుడు ఔటవుతారో కూడా తెలియని విధంగా ఊగిపోతూ చివరకు వికెట్ అప్పగిస్తుంటారు. కానీ టీ20 మ్యాచ్ ను కూడా ఎలా అంటే అలా ఆడొచ్చని నిరూపించాడు రుతురాజ్ గైక్వాడ్. ఆరంభంలో ఆచితూచి.. మధ్యలో నిదానంగా.. కుదురుకున్నాక వీరబాదుడు.. ఈ లాజిక్ తోనే రుతురాజ్ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ రాణించి సెంచరీతో మార్క్ చూపించాడు. సొగసైన ఆటతో, కళాత్మక డ్రైవ్ లతో, నిలకడైన ప్రదర్శనతో ఏ మాత్రం తొణుకుబెణుకు లేకుండా, ప్రత్యర్థికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆస్ట్రేలియా బౌలింగ్ దీటుగా ఎదుర్కొన్నాడు. రుతురాజ్ గైక్వాడ్(123; 57 బంతుల్లో 13×4, 7×6) అసామాన్య బ్యాటింగ్ తో భారత్.. 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.
10వ ఓవర్ తర్వాత వీర విజృంభణ
ఇన్నింగ్స్ పదో ఓవర్ పూర్తయ్యే సరికి భారత్ స్కోరు 80/2. యశస్వి(6), ఇషాన్(0) ఇద్దరూ ఔటవగా, సూర్యకుమార్ 28 బాల్స్ లోనే 39 పరుగులతో బాదుతూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రుతురాజ్ మాత్రం అప్పటికి 21 బాల్స్ ఆడి కేవలం 21 పరుగులతోనే ఉన్నాడు. ఇక 11వ ఓవర్ నుంచి స్టార్ట్ అయింది హిట్టింగ్. 13, 14 ఓవర్లలో రెండేసి ఫోర్లు, 15వ ఓవర్లో ఫోర్, సిక్స్, 18వ ఓవర్లో మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో వీరబాదుడు బాదాడు. గైక్వాడ్ విధ్వంసం సృష్టించడంతో టీమిండియా మంచి స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది. సూర్యకుమార్(39; 29 బంతుల్లో 5×4, 2×6), తిలక్ వర్మ(31; 24 బంతుల్లో 4×4, 2×6) తలో చేయి వేశారు. ఈరోజు ఆటలో రుతురాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. 32 బాల్స్ లో ఫిఫ్టీ 9 ఫోర్లతో పూర్తి చేసుకున్న అతడు.. మరో ఫిఫ్టీతో సెంచరీ పూర్తి చేసుకోవడానికి పట్టిన బాల్స్ కేవలం 20. మ్యాక్స్ వెల్ ఒక్క ఓవర్ లోనే 30 పరుగులు సమర్పించుకున్నాడు.