Published 17 Dec 2023
టీమిండియా సీమర్లు(Fast Bowlers) విసిరిన వలలో పడ్డ దక్షిణాఫ్రికా బ్యాటర్లు విలవిల్లాడుతూ వికెట్లు కోల్పోయారు. 2-3, 3-42, 4-52, 6-52, 7-58, 8-73.. ఇదీ స్కోరు బోర్డుపై కనిపించిన సఫారీ జట్టు వికెట్ల తీరు. భారత పేస్ బౌలింగ్ ధాటికి సొంతగడ్డపైనే సౌతాఫ్రికా చేతులెత్తయక తప్పలేదు. ముఖ్యంగా షార్ట్ లెంత్, ఇన్ స్వింగర్లతో అర్షదీప్ ఆటాడుకున్నాడు. మరో ఎండ్ లోనూ ఆవేశ్ ఖాన్ సైతం తాను తక్కువ కాదన్నట్లు అతడితో సమానంగా రెచ్చిపోయాడు. లెఫ్టార్మ్ సీమర్ ధాటికి ఓపెనర్లిద్దరూ రీజా హెన్రిక్స్(0), వాన్ డెర్ డసెన్(0) డకౌట్ గా వెనుదిరిగారు. టోనీ డి జోర్జి(28) కొద్ది సేపు ప్రతిఘటించినా, కెప్టెన్ మార్ క్రమ్(12), క్లాసెన్(6), మిల్లర్(2), మల్డర్(0) ఇలా టాప్, మిడిలార్డర్ అంతా చేతులెత్తేసింది. ఒకరి బాట మరొకరు పట్టడంతో 27.3 ఓవర్లలోనే ఆ టీమ్ 116 పరుగులకు ఆలౌటయింది.
‘సింగ్ ఈజ్ కింగ్’
బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ పై జోరు చూపించాలన్న ఉద్దేశంతో జోహెన్నెస్ బర్గ్ స్టేడియంలో టాస్ గెలవగానే సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆ జట్టు అంచనాలు తప్పి బొక్కాబోర్లా పడాల్సి వచ్చింది. ‘సింగ్ ఈజ్ కింగ్’ దడదడలాడిస్తూ 5 వికెట్లు తీసుకోవడంతో.. ఆ స్కోరు బోర్డుపై పరుగుల కన్నా వేగంగా వికెట్లు కనిపించాయి. హ్యాట్రిక్ కాకున్నా కంటిన్యూగా మూడు బంతుల్లో 3 వికెట్లు పడటం ఆతిథ్య జట్టును కోలుకోకుండా చేసింది. పదో ఓవర్ చివరి బంతికి క్లాసెన్ ను అర్షదీప్ ఔట్ చేస్తే.. 11వ ఓవర్ తొలి రెండు బాల్స్ కు మార్ క్రమ్, మల్డర్ ను ఆవేశ్ ఖాన్ బుట్టలో వేసుకున్నాడు. స్పిన్నర్లు ఇంకా బాల్ పట్టకుండానే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లే దక్షిణాఫ్రికా కథను ఎండింగ్ స్టేజ్ కు చేర్చారు. ఆవేశ్ ఖాన్ నాలుగు, కుల్దీప్ ఒక వికెట్ తీసుకున్నారు.