చివరిదైన టీ20లో భారత్ పరుగుల సునామీ సృష్టించింది. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన టీమ్ఇండియా బ్యాటర్లు.. ఆతిథ్య దక్షిణాఫ్రికా(South Africa)కు పీడకలను మిగిల్చారు. శాంసన్-అభిషేక్ జోడీ(Partnership) తొలి వికెట్ కు 73 పరుగులు జోడిస్తే.. ఆ తర్వాత తిలక్ వర్మ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శాంసన్-తిలక్ జంట సెంచరీలతో విరుచుకుపడి సిక్సర్లు ఇంత సులువా అన్నట్లు బంతిని కసితీరా స్టాండ్స్ లోకి పంపించింది. దీంతో టీమ్ఇండియా 14.1 ఓవర్లలోనే 200 మార్క్ దాటింది.
మొదట్నుంచీ దక్షిణాఫ్రికాపై 12 ఓవర్లకు పైగా రన్ రేట్ కంటిన్యూ చేయగా చివర్లో అది 14 దాటింది. సంజూ కొంచెం ఆచితూచి ఆడితే తిలక్ మాత్రం బంతి పడటమే ఆలస్యమన్న రీతిలో ఉతికి ఆరేశాడు. 51 బాల్స్ లో సంజూ.. 41 బంతుల్లో తిలక్ 100 మార్క్ ను పూర్తి చేసుకున్నారు. ఈ ఇద్దరూ అజేయంగా రెండో వికెట్ కు 210 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమ్ఇండియా వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు చేశాడు. మొత్తంగా ఈ టీ20లో 23 సిక్స్ లు రాగా, అందులో తిలక్ వి 10, సంజూవి 9 ఉన్నాయి.