Published 28 Nov 2023
యశస్వి జైస్వాల్.. భారత యువ సంచలనం(Indian Youngster). బెదురన్నదే లేకుండా జట్టుకు అవసరమైన రీతిలో ఆడే ఈ కుర్రాడు.. ఆస్ట్రేలియాతో రెండో టీ20లో ఎలా చెలరేగిపోయాడో చూశాం. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తూ కంగారూలను బెంబేలెత్తించాడు. జట్టుకు విజయానికి కారణంగా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న సమయంలో జైస్వాల్ ‘సారీ’ చెప్పడం ఆశ్చర్యానికి కారణమైంది. విశాఖపట్నం(Vishakhapatnam)లో జరిగిన తొలి మ్యాచ్ లో తాను చేసిన పొరపాటు వల్లే రుతురాజ్ గైక్వాడ్(0) రనౌట్(Run Out) గా వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు. ‘నిజంగా నేను సారీ చెబుతున్నా.. రుతురాజ్ రనౌట్ కు పూర్తి పొరపాటు నాదే.. పరుగు కోసం నేనే పిలిచా.. ఆ సమయంలో స్టాయినిస్ గమనిస్తూనే ఉన్నాడు.. గైక్వాడ్ కు మనస్ఫూర్తిగా క్షమాపణలు.. ఈ విషయాన్ని జిమ్ లోనూ ఆయనతో చెప్పా.. మరోసారి మనమిద్దరం అండర్ స్టాండింగ్ తో రన్స్ తీద్దాం అని అతడు చెప్పాడు’ అని జైస్వాల్ అన్నాడు.
తొలి మ్యాచ్ లో 21 పరుగులు చేసిన 21 ఏళ్ల యశస్వి.. తదుపరి మ్యాచ్ లో మాత్రం 25 బాల్స్ లోనే 53 పరుగులు చేశాడు. ఫస్ట్ టీ20లో అవగాహన రాహిత్యం వల్ల రనౌట్ అయినా సెకండ్ మ్యాచ్ లో ఈ జోడీ అదరగొట్టింది. ఒకవైపు జైస్వాల్ దుమ్ముదులుపుతుంటే మరో ఎండ్ లో గైక్వాడ్(58) చూసుకుంటూ ఆడుతూ ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ IPLలో తమ తమ టీమ్ ల తరఫున దడదడలాడించిన సంగతి తెలిసిందే.