రెండు సార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ కు ఘోర పరాభవం ఎదురైంది. వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. క్వాలిఫైయింగ్ సూపర్ సిక్స్ మ్యాచ్ లో పసికూన చేతిలో ఓటమి పాలైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్… బ్రెండన్ మెక్ ములన్ ఆల్ రౌండ్ ప్రతిభతో 7 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 రన్స్ కు ఆలౌట్ కాగా.. 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసి స్కాట్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది. విండీస్ బ్యాటర్లలో జేసన్ హోల్డర్(45; 79 బంతుల్లో 3X4, 1X6) టాప్ స్కోరర్ కాగా… రొమారియో షెఫర్డ్(36; 43 బంతుల్లో 5X4) రాణించాడు. కెప్టెన్ హోప్ తో పాటు మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రెండన్ మెక్ ములన్(3/32) విండీస్ వెన్ను విరిస్తే మార్క్ వ్యాట్, క్రిస్ సోల్, క్రిస్ గ్రేవ్స్ తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్.. స్కోరు బోర్డుపై పరుగులేవీ లేకుండానే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్ బ్రైడ్ త్వరగానే పెవిలియన్ చేరుకున్నాడు. మరో ఓపెనర్ మాథ్యూ క్రాస్(74; 107 బంతుల్లో 7X4), వన్ డౌన్ బ్యాటర్ బ్రెండన్ మెక్ ములన్(69; 106 బంతుల్లో 8X4) ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడంతో విండీస్ పరాభవం దిశగా సాగింది. మిడిలార్డర్ బ్యాటర్లు జార్జ్ మున్సీ(18), రిచీ బెరింగ్టన్(13) మరో వికెట్ పడకుండా స్కాట్లాండ్ ను సులువుగా గెలుపు తీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, షెఫర్డ్, హోసీన్ తలో వికెట్ తీశారు. ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న బ్రెండన్ మెక్ ములన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.