
Published 26 Nov 2023
తొలి టీ20లో విజయం సాధించి ఊపు మీదున్నట్లు కనిపిస్తున్న భారత్(India) నేడు ఆస్ట్రేలియా(Australia)తో రెండో టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్న వేళ మరో గెలుపును సొంతం చేసుకుని ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. అటు భారీ స్కోరు చేసినా దాన్ని నిలబెట్టుకోవడంలో ఆసీస్ బౌలర్లు విఫలమయ్యారు. రెండు జట్లలోనూ బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. ఈరోజు జరిగే కేరళలోని తిరువనంతపురం స్టేడియం సైతం బ్యాటింగ్ కు అనుకూలించనుందని స్టేడియం వర్గాలు అంటున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు భారత్ 3 మ్యాచ్ లాడితే అందులో రెండింటిలో విజయాల్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డుపడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నది. నిన్న కురిసిన వర్షం వల్ల పూర్తిస్థాయిలో కవర్లు కప్పి ఉంచగా.. ఈ రోజు సైతం మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశముంది.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో తీవ్ర ప్రభావానికి గురైన భారత్.. ఈ సిరీస్ లో గెలిచి ఉపశమనం(Relax) పొందాలని చూస్తున్నది. వన్డే ప్రపంచకప్ తుది జట్టులో ఆడిన సూర్యకుమారే ప్రస్తుత టీ20 టీమ్ కు కెప్టెన్ కావడం, ఫస్ట్ మ్యాచ్ లో కసిగా ఆడి 80 రన్స్ సాధించడంతో టీమిండియా బ్యాటింగ్ గాడిన పడ్డట్లే కనిపిస్తున్నది. యశస్వి జైస్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్ ఇలా ఎనిమిదో నంబర్ దాకా బ్యాటర్లు ఉన్నారు. కుర్ర ప్లేయర్లు, పటిష్ఠ బ్యాటింగ్ లైనప్ తో కూడిన జట్టుతోనే సిరీస్ సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే కంగారూలపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం(Domination) ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది.