చెన్నై(Chennai) బ్యాటర్లు తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులతో చెండాడటంతో గుజరాత్(Gujarat) తొలి ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సూపర్ కింగ్స్.. ధనాధన్(Fastest) ఆటతీరుతో 6 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన గిల్ సేన… 55 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరకు టాప్, మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు. ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లకు 143 పరుగుల వద్దే ఆగిపోయి 63 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
దూబె ఫాస్ట్ ఫిఫ్టీ…
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(46; 36 బంతుల్లో 5×4, 1×6), రచిన్ రవీంద్ర(46; 20 బంతుల్లో 6×4, 3×6) ధాటైన బ్యాటింగ్ తో హోరెత్తించారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్ లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రహానే(12) వెంటనే ఔటయ్యాడు. ఇక అప్పుడు మొదలైంది.. శివమ్ దూబె వీరవిహారం. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబె(51; 23 బంతుల్లో 2×4, 5×6) ఆటాడుకున్నాడు. రుతురాజ్ తోపాటు మిచెల్(24 నాటౌట్)తో మంచి పార్ట్నర్ షిప్ లు నమోదు చేయడంతో చెన్నై భారీ స్కోరు చేసింది. సమీర్ రిజ్వీ(14), రవీంద్ర జడేజా(7) రన్స్ చేశారు.
తేలిపోయిన గుజరాత్…
పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్.. చెన్నై తరహా ఆటతీరును చూపించలేకపోయింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(21), కెప్టెన్ శుభ్ మన్(8) త్వరగానే వికెట్లు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరినీ దీపక్ చాహరే వెనక్కు పంపాడు. ఆ తర్వాత విజయ్ శంకర్(12) కూడా ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. భారమంతా సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్(21) జోడీపైనే పడింది. కానీ మిల్లర్ ను దేశ్ పాండే ఔట్ చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సుదర్శన్ (37) సైతం బ్యాట్ కు పనిచెప్పకపోవడంతో గుజరాత్ తేలిపోయింది. ఒమర్జాయ్(11), రాహుల్ తెవాతియా(6), రషీద్ ఖాన్(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.