క్వింటన్ డికాక్, బవుమా, వాండెర్ డసెన్, మార్ క్రమ్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్… ఈ పేర్లు చెబితే ప్రపంచంలోని పెద్ద పెద్ద జట్లకే వణుకు. ఈ ఆరుగురిలో ఏ ముగ్గురు ఫామ్ లో ఉన్నా ఆ జట్టు బౌలర్లకు చుక్కలే. ఇప్పటికే రెండింటికి రెండు భారీ విజయాలతో మంచి నెట్ రన్ రేట్(Net Run Rate) ను సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా.. చివరకు ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్ రుచి చూస్తున్న నెదర్లాండ్స్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్(World Cup)లో మరో పెను సంచలనం నమోదైంది. ఇప్పటికే అఫ్గానిస్థాన్ చేతిలో ఓడి పరువు పోగొట్టుకున్న ఇంగ్లండ్ ఆట మరువకముందే మరొక సంచలనం క్రియేటైంది. పసికూన నెదర్లాండ్స్ రికార్డు స్థాయిలో.. టాప్ టీమ్ అయిన సౌతాఫ్రికాను ఓడించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో నెదర్లాండ్స్ 8 వికెట్లకు 245 పరుగులు చేయగా… సౌతాఫ్రికా మరొక్క బాల్ మిగిలి ఉండగానే 42.5 ఓవర్లలో 207 రన్స్ కు ఆలౌటై 38 పరుగుల తేడాతో అపజయం పాలయింది.
కెప్టెన్ అండతో నిలదొక్కుకున్న నెదర్లాండ్స్
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టులో టాప్ ఏడుగురు బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. 140 రన్స్ కే 7 వికెట్లు చేజార్చుకోవడంతో 150కే నెదర్లాండ్స్ చాప చుట్టేస్తుందని భావించారు. కానీ అక్కడే అనూహ్యం జరిగింది. కెప్టెన్, వికెట్ కీపర్ అయిన స్కాట్ ఎడ్వర్డ్స్ బ్యాట్ కు పనిచెప్పాడు. మిగతా వారి నుంచి సహకారం లేకున్నా ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఎడ్వర్డ్స్ 69 బంతుల్లోనే 78 రన్స్ చేసి సౌతాఫ్రికా బౌలర్లను హడలెత్తించాడు. చివర్లో వాండెర్ మెర్వ్(29), ఆర్యన్ దత్(23) సహకరించడంతో ఎడ్వర్డ్స్ తమ టీమ్ కు 245 పరుగుల భారీ స్కోరును అందించాడు. ఎంగిడి, జాన్సెన్, రబాడ తలో మూడు వికెట్లు తీసుకున్నారు.
మరోసారి నిలకడలేమితో సౌతాఫ్రికా
వరల్డ్ కప్ లో నిలకడలేమి జట్టు ఏదయినా ఉందంటే అది కచ్చితంగా దక్షిణాఫ్రికానే అని క్రికెట్ తెలిసిన వారందరూ చెబుతారు. లీగ్ దశలో అద్భుతంగా రాణించి సెమీస్ లో చతికిలపడటం ఆ టీమ్ కు వెన్నతో పెట్టిన విద్య. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుత వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లోనే అవమానకర పరిస్థితిని ఎదుర్కొంది. మిల్లర్(43) మినహా కెప్టెన్ బవుమా(16), డికాక్(20), వాండెర్(4), మార్ క్రమ్(1), క్లాసెన్(28) ఇలా అంతా పెద్దగా పరుగులు చేయకుండానే ఒకరి వెంట ఒకరు దారి పట్టారు. నెదర్లాండ్స్ బౌలర్లలో నలుగురు రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు. లొగాన్ వాన్ బీక్, పాల్ వెన్ మీకెరన్, వాండెర్ మెర్వ్, డి లీడ్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకుని సౌతాఫ్రికా వెన్నువిరిచారు. దక్షిణాఫ్రికా పరాజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. 36 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ చేజార్చుకున్న బవుమా సేన.. 44 పరుగులకు 4, 89 రన్స్ కు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరకు మిల్లర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండానే ఔటవడంతో ఆ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ దశలో స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కాసేపు నెదర్లాండ్స్ ను అడ్డుకున్నాడు. అతి కష్టం మీద రబాడ, ఎంగిడి అండతో తమ టీమ్ స్కోరును 200 మార్క్ ను దాటించగలిగాడు. హాఫ్ సెంచరీతో జట్టుకు గెలుపు బాట వేసిన నెదర్లాండ్స్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.