వరల్డ్ కప్ ముంగిట భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో సిరీస్ ను గెలుపొందింది. ఇప్పటికే ఆసియా కప్ ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ ను సైతం ఒడిసిపట్టుకుంది. రెండో వన్డేలో తొలుత బ్యాటర్లు విజృంభిస్తే.. అనంతరం బౌలర్లు ఆటాడుకున్నారు. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 99 పరుగులతో ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. గిల్(104; 97 బంతుల్లో 6×4, 4×6), శ్రేయస్(105; 90 బంతుల్లో 11×4, 3×6) సెంచరీలతో చెలరేగారు. గిల్ 37 బంతుల్లో (52), శ్రేయస్ 41 బాల్స్ లో(50) వేగంగా హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేశారు. ఈ జంట రెండో వికెట్ కు 200 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేసింది. కెప్టెన్ రాహుల్(52; 38 బంతుల్లో 3×4, 3×6), సూర్యకుమార్(72; 37 బంతుల్లో 6×4, 6×6) ధనాధన్ బ్యాటింగ్ తో కంగారూ జట్టును కంగారు పెట్టించారు. ముఖ్యంగా కామెరాన్ గ్రీన్ వేసిన ఓవర్లో సూర్య కంటిన్యూగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. బ్యాటర్లంతా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ఇండియా.. 5 వికెట్లకు 399 రన్స్ చేసింది. గ్రీన్ 2, జంపా, హేజిల్ వుడ్, అబాట్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
400 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ కు మొదట్లోనే చుక్కలు కనిపించాయి. వరుస బంతుల్లో మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0) అవుటయ్యారు. ఈ ఇద్దరినీ ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ పంపించాడు. కానీ డేవిడ్ వార్నర్(52) పట్టుదలగా ఆడాడు. 9 ఓవర్లలో 56/2తో ఉన్న దశలో వర్షం పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా టార్గెట్ ను 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్దేశించారు. కానీ ఆ జట్టు 28.2 ఓవర్లలోనే 217 రన్స్ కు ఆలౌటయింది. వార్నర్ తోపాటు అబాట్ సైతం చివర్లో ధాటిగా ఆడి(54) హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్లు లబుషేన్(27), ఇంగ్లిస్(6), క్యారీ(14), గ్రీన్(19) పెద్దగా ఆడకపోవడంతో ఆ జట్టు చాప చుట్టేసింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా మూడేసి వికెట్లతో కంగారూల నడ్డి విరవగా… ప్రసిద్ధ్ కృష్ణ 2, షమి ఒక వికెట్ తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో టోర్నీ గెలిచిన భారత్… ఈ నెల 27న రాజ్ కోట్ లో జరిగే మూడో వన్డేలో ఆసీస్ తో తలపడుతుంది.