Published 22 Nov 2023
భారత్(Team India) బాగా ఆడుతుంటే కొందరు పాకిస్థాన్(Pakistan) ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారని, ఇది వారి నైజమంటూ పేస్ బౌలర్ మహ్మద్ షమి అన్నాడు. ‘వరల్డ్ కప్ లో తొలుత నేను ఆడలేదు.. తర్వాత టీమ్ లోకి వచ్చి మూడుసార్లు 5 వికెట్ల హాల్ అందుకున్నా.. దీన్ని కొందరు పాక్ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.. దీనికి నేనేం చేయాలి’ అంటూ షమి సెటైర్ వేశాడు. ‘మీరు మంచి ప్లేయర్లే అయితే ఎదుటి వారి సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేసేవాళ్లు.. కానీ అలా జరగకపోవడం బాధాకరం.. తమకంటే ఎవరూ గొప్పకాదు అన్న మైండ్ సెట్ ఉన్నవాళ్లే ఇలా చేస్తారు.. అందరికన్నా మేమే బెస్ట్ అన్న థింకింగే వారిని అందరికీ దూరం చేస్తోంది’ అంటూ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు.
భారత బౌలర్లకు ప్రత్యేక బాల్స్ ని ICC ఇస్తున్నదంటూ పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా రెగ్యులర్ గా కామెంట్ చేస్తూనే ఉన్నాడు. దీన్ని వసీమ్ అక్రమ్ సహా పలువురు పాక్ ప్లేయర్లు ఖండిస్తూ హసన్ రజా తీరును విమర్శించారు. అయితే ఈ వరల్డ్ కప్ లో షమి కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు(55) తీసిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించిన షమి.. ఫాస్టెస్ట్ గా 50 వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో ఆడిన 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు తీసి నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు. మూడు సార్లు 5 వికెట్లకు పైగా మరోసారి 4 వికెట్లు తీసి వరల్డ్ కప్ లో జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ పేరిట ఉన్న 44 వికెట్ల రికార్డును తిరగరాశాడు. అలాంటి షో చేసిన టీమిండియా ప్లేయర్లపై హసన్ రాజా చేసిన కామెంట్స్ మీద షమి ఫైర్ అయ్యాడు.