Photo: The Times Of India
Published 24 Dec 2023
వివాదాస్పదంగా, ఒంటెద్దు పోకడలతో తయారైన భారత్ రెజ్లింగ్ ఫెడరేషన్(WFI)కి ఎట్టకేలకు కేంద్రం షాకిచ్చింది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని(Body) సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. దేశ క్రీడాలోకం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన బాట పట్టిన రెజ్లర్లకు ఊరట లభించినట్లయింది. రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికను నిరసిస్తూ ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్ తన కెరీర్ నే వదులుకోగా, భజరంగ్ పునియా ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కిచ్చేశాడు. అటు అంధుల ఛాంపియన్ వీరందర్ సింగ్ యాదవ్ సైతం రెజ్లర్లకు సానుభూతిగా తన ‘పద్మశ్రీ’ని రిటర్న్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. కార్యవర్గాన్ని రద్దు చేయకపోగా, ప్రస్తుతానికి సస్పెన్షన్ లో పెట్టి తదుపరి ఆర్డర్స్ ఇచ్చేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా చేసింది.
అసలు కథ ఇది…
WFI అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో జూనియర్ రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ బ్రిజ్ భూషణ్ శరణ్ పై ఆరోపణలున్నాయి. విచారణ జరపాలంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాతోపాటు పెద్ద సంఖ్యలో ప్లేయర్లు ఆందోళనకు దిగారు. అటు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేశారు. బ్రిజ్ భూషణ్ ను తొలగించేవరకు తగ్గేది లేదంటూ పార్లమెంటు కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లింగ్ ఛాంపియన్లంతా భారీ ధర్నాకు దిగారు. జనవరి నుంచి ఆందోళన చేస్తున్న ప్లేయర్లను క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలుచుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ BJP ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోకుండా లేట్ చేస్తున్నారన్న భావన రెజ్లర్లలో ఉంది.
కొత్త కమిటీకి ఆయనే..
తాజాగా జరిగిన ఎలక్షన్స్ నుంచి బ్రిజ్ భూషణ్ తప్పుకున్నా అతని సన్నిహితుడు సంజయ్ సింగ్ WFI ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. తిరిగి మళ్లీ అధికారమంతా పాత ప్రెసిడెంట్ చేతుల్లోకే వెళ్లిందన్నది ఆటగాళ్ల ఆవేదన. దీన్ని నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు గుడ్ బై చెప్పడం, ఇద్దరు ప్లేయర్లు ‘పద్మశ్రీ’లను తిరిగి ఇస్తామని చెప్పడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. ఇది ప్రభుత్వానికే ఇబ్బందిగా మారుతుందని భావించి ఏకంగా కొత్త బాడీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.