
వరల్డ్ కప్ సెమీస్ రేసులో దక్షిణాఫ్రికా మరో ముందడుగేసింది. న్యూజిలాండ్ ను చిత్తు చేసిన ఆ జట్టు.. 12 పాయింట్లతో భారత్ తో సమానంగా నిలిచింది. పుణెలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్.. సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. డికాక్, వాండెర్ డసెన్ భారీ సెంచరీలతో సౌతాఫ్రికా పరుగుల మోత మోగించి 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ ను 35.3 ఓవర్లలో 167 పరుగులకే కట్టడి చేసి 190 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఏడు మ్యాచ్ ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు దక్కించుకుని సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
సెంచరీ వీరుల విధ్వంసం
కెరీర్ లోనే అత్యద్భుత ఫామ్ లో ఉన్న క్వింటన్ డికాక్(114; 116 బంతుల్లో 10×4, 3×6) మరోసారి సెంచరీ మోత మోగించాడు. అటు వాండెర్ డసెన్(133; 118 బంతుల్లో 9×4, 5×6) సైతం ధనాధన్ సెంచరీతో భారీ స్కోరు అందించాడు. ఈ టోర్నీలో డికాక్ కు ఇది నాలుగో శతకం కాగా, డసెన్ కు రెండోది. కెప్టెన్ బవుమా(24) మరోసారి ఫెయిల్ కాగా.. డేవిడ్ మిల్లర్(53; 30 బంతుల్లో 2×4, 4×6) చివర్లో దడదడలాడించడంతో జట్టు స్కోరు మరోసారి 350 దాటింది.
ఒకరి వెంట మరొకరు
ఈ టోర్నీలో తొలుత బాగా రాణించిన కివీస్ తర్వాతి దశలో అవస్థలు ఎదుర్కొంటున్నది. ఏ ఒక్క బ్యాటరూ నిలవకపోవడంతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాన్వే(2), యంగ్(33), రచిన్(9), మిచెల్(24), కెప్టెన్ లాథమ్(4) తక్కువ రన్స్ కే ఔటయ్యారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్(60) ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించాడు. చేయాల్సిన స్కోరు భారీగా ఉన్నా లక్ష్య ఛేదనపై ఏ ఒక్కరూ దృష్టిపెట్టకపోవడంతో కివీస్ కు భారీ ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 4, జాన్సన్ 3 వికెట్లు తీసుకుని న్యూజిలాండ్ వెన్నువిరిచారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను వాండెర్ అందుకున్నాడు.